కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టుటకై హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన కంటైన్‌మెంట్ జోన్ల నిర్వహణ బాగున్నదని కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు డా.చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం డా.రవీంద్రతో కలిసి చాంద్రాయణగుట్ట సర్కిల్‌లోని మూడు కంటైన్‌మెంట్ క్లస్టర్లలో పర్యటించారు. బారీకేడింగ్ పరిశీలించి, కంటైన్‌మెంట్ జోన్ పరిధిలో ఎన్ని ఇళ్లు, కుటుంబాలు ఉన్నాయి, నిత్యవసర వస్తువులను అందించుటకు చేసిన ఏర్పాట్లు, వాట్సప్ గ్రూప్ వివరాలను డిప్యూటి కమిషనర్ షెర్లి పుష్పరాగంను అడిగి తెలుసుకున్నారు.
కంటైన్‌మెంట్‌లో రెగ్యులర్‌గా నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే, శానిటేషన్, క్రిమిసంహారకాల స్ప్రేయింగ్ గురించి వాకబ్ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. సర్వేలెన్స్ టీమ్‌కు వ్యక్తిగత రక్షణ కిట్‌లు అందజేసినట్లు అధికారులు వివరించారు. శానిటేషన్ వర్కర్లకు మాస్కులు, గ్లౌస్‌లు, శానిటైజర్లు ఇచ్చినట్లు తెలిపారు. ఎమర్జెన్సీ అధికారుల బృందం 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కంటైన్‌మెంట్‌కు బయట ఉన్న కుటుంబాలతో కేంద్ర అధికారులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారులు డా.జ్యోతి, డా.జయపాల్‌రెడ్డి, డా.మురళీ, కంటైన్‌మెంట్ జోన్ నోడల్ అధికారులు ఖదీర్, డేవిడ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.