సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ బిగ్ బాస్ పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో లక్ష్మీనారాయణ నాలుగు రోజుల పర్యటనలో భాగంగా నేడు కాకినాడలో నిర్వహించిన ‘ప్రజాస్వామ్య పరిరక్షణ సదస్సు’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ రియాల్టీ షోను సెలబ్రిటీలతో కాకుండా రైతులతో నిర్వహించాలని అన్నారు. అప్పుడే రైతుల ఆవేదన అర్థం అవుతుందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంపై ప్రజలు దృష్టి పెట్టాలని.. రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని సూచించారు. సామాజిక వర్గం కన్నా.. సమాజమే ముఖ్యమని చెప్పారు. సీఎం చంద్రబాబుతో సమావేశానికి సమయం కుదిరనప్పుడు జిల్లాలో తాను గుర్తించిన సమస్యలను ఆయనకు తెలియజేస్తానని చెప్పారు.
ఈ ప్రాంతంలో ఓఎన్జీస్ వలన ప్రజలు ఇబ్బందులపై ఓ నివేదిక చేసి సీఎం చంద్రబాబుకి అందజేస్తానని, అలాగే కొబ్బరి, మత్య్సకారుల రైతుల సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. బిగ్ బాస్ చూస్తూ.. యువత ప్రతి రోజు 2 గంటల సమయం వృద్ధా చేస్తున్నారని గతవారం బిగ్ బాస్ పై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.