లాభం కొంత మానుకొని సేవలో టెక్కీ రైడ్‌…

227
- Advertisement -

సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి సాయపడవోయి అన్న మహాకవి గురజాడ అప్పారావు సూక్తిని స్పూర్తిగా తీసుకుని తోటివారికి సాయపడదాం అనే కాన్సెప్టులో టెక్కీరైడ్ ముందుకెళ్తుంది. ట్రాఫిక్ సమస్యను అధిగమించి.. ఇంధనం ఆదా చేయడమే లక్ష్యంగా మొదలుపెట్టిన కార్ పూలింగ్‌ హైక్ అనే టెక్కిరైడ్‌ సర్వీసు విధ్యార్థులకు కూడా అండగా నిలుస్తోంది. కారు పూలింగ్‌తో ఆదా చేసిన డబ్బును పేద విద్యార్ధుల చదువులకు ఉపయోగిస్తోంది. ఇలా రెండేళ్లుగా సమాజసేవ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను గ్రేట్ తెలంగాణ.కామ్ పలకరించింది. వారు పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

ఎక్కడో రింగ్‌ రోడ్డు నుండి హైటెక్‌ సిటీ వరకు  ప్రయాణం.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రాఫిక్.. మండిపోతున్న ఇంధనం రేట్లు..  రద్దీగా ఉండే సిటీ బస్సుల్లో ట్రావెల్ చేయాలంటే టైమ్‌కు ఆఫీస్‌కు చేరుకోలేం.. అలాగని ఆటోలు, టాక్సీల్లో ప్రయాణిద్దాం అనుకుంటే ఛార్జీల మోత. ఇలాంటి పరిస్థితుల్లో.. సొంత వాహనాన్నే ఉపయోగిస్తూ, పెట్రోల్ ఖర్చును ఆదా చేసుకోవటానికి ఉపయోగపడే చక్కటి మార్గం.. కార్ పూలింగ్.

కార్‌ పూలింగ్‌… అంటే నలుగురు కలిసి ప్రయాణించడం.. సొంత కారున్నా.. మరొకరి కారులో షేర్ చేసుకుని ఆఫీస్‌కు వెళ్లడం. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఒకే రూట్లో రూట్లో వచ్చే సహోద్యుగులను, తెలిసిన వ్యక్తులను పికప్, డ్రాప్ చేయటం.. ఇలా చేస్తే సమయం ఆదాతో పాటు.. పర్సు కూడా ఖాళీకాదు.

unnamed

కారు పూలింగ్‌ సర్వీసులు ముంబై, ఢిల్లీ, బెంగుళూరు వంటి నగరాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.ఈ కాన్సెప్టునే హైదరాబాద్ కు చెందిన టెక్కీరైడ్ కార్ పూలింగ్ సర్వీస్ అడాప్ట్‌ చేసుకుంది. మొదట ఏడుగురితో మొదలైన టెక్కీ రైడ్ ప్రయాణం.. నేడు 450కి చేరింది. ఈ గ్రూప్ క్రియేట్ కాకముందు సభ్యులంతా 200 కార్లు, వంద బైక్లు, క్యాబులు, బస్సుల్లో జర్నీ చేసేవారు. ఇప్పుడు గ్రూప్ లో చేరాక 80నుంచి 100 కార్లలో ఆఫీసుకు వెళ్తున్నారు. గ్రూప్ లోని వ్యక్తి కారులో స్టార్ట్ అయ్యేటపుడు స్టార్టింగ్ పాయింట్ తో పాటు, ఎండింగ్ పాయింట్ రూట్ ని గ్రూప్ లో పోస్ట్ చేస్తాడు. అ టైమ్ లో ఆ రూట్లో ఎవరైతే వెళ్తున్నారో వాళ్లు తామున్న పాయింట్ ని పోస్ట్ చేస్తారు. అలా ఒకే రూట్లో వెళ్లేవాళ్లంతా రైడ్ షేర్ చేసుకుని ఆఫీసుకు వెళ్తున్నారు.

కారు పూలింగ్‌ సర్వీస్‌ రాకముందూ ఒకరికి పదివేల ఖర్చొస్తే.. ఇప్పుడు 3 నుంచి 4వేల మాత్రమే అవుతున్నాయి. డబ్బు.. ఇంధనం ఆదా చేయడంతో పాటూ పర్యావరణానికి తమవంతు సాయం చేసిన వాళ్లవుతున్నారు. ఈ సర్వీస్‌తో డ్రైవింగ్ ఒత్తిడి తగ్గింది.. ఆరోగ్యం పెరిగింది. అయితే టెక్కీల్లో మహిళలు కూడా ఉన్నారు. వారు ఈ సర్వీస్‌ని వాడుకోవడం కూడా తక్కువే. ఇలాంటి ప్రయాణాలకు మహిళలు దూరంగా ఉండడానికి కారణం.. భద్రత. అపరిచిత వ్యక్తులతో ప్రయాణమంటే వారు ధైర్యం చేయరు. అయితే టెక్కీ రైడ్ లో అలాంటి భయాలేమీ లేవు. మహిళల భద్రతకు పూర్తి భరోసా ఇస్తుందీ టెక్కీ రైడ్‌.

unnamed (5)

మహిళల సెక్యూరిటీ విషయంలో గ్రూప్ మెంబర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెహికిల్ ఎక్కినప్పటి నుంచి దిగేవరకు గ్రూప్ లో ఆప్డేట్స్ పెడుతుంటారు. దీంతో అడ్మిన్ మెంబర్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. అంతే కాకుండా ఉద్యోగాలకు సంబంధించిన సమచారం కూడా గ్రూప్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంటుంది. టెక్కీరైడ్ పేరుతో త్వరలోనే ఒక మొబైల్ ఆప్లికేషన్ కూడా రాబోతోంది.

అయితే ఇది కూడా అన్ని గ్రూపుల్లాంటిదే అనుకుంటే పొరపాటే. టెక్కీరైడ్ కేవలం షేరింగ్ కోసమే పరిమితం కాలేదు. వీళ్ల మనీ సేవింగ్ వెనుక ఒక గొప్పసామాజిక బాధ్యత కూడా ముడిపడి వుంది. గ్రూప్ అడ్మిన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన రఘు ఆలోచనకు ప్రతిరూపమే ఈ సోషల్ సర్వీస్ కాన్సెప్ట్. సొంతలాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడవోయ్ అనే సిద్ధాంతాన్ని నమ్మి.. గ్రూప్ క్రియేట్చేశాడు రఘు.

unnamed (3)

ఈ గ్రూప్ సభ్యులు మూడు నెలలకోసారి విలేజ్ రైడ్ నిర్వహిస్తారు. వీళ్లు ఆదా చేసిన డబ్బుని పేద పిల్లల కోసం ఖర్చుపెడతారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడానికి ఈ ఆదా చేసిన డబ్బుని ఉపయోగిస్తారు. ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని అక్కడి స్కూల్లో విద్యార్ధులకు ఏవైతే అవసరమో అవి సరఫరా చేస్తారు. స్టేషనరీ, కుర్చీలు, బెంచీలు, బుక్స్, బ్యాగ్స్, షూస్ వగైరా వగైరా అన్నమాట . ఇప్పటిదాకా నాలుగు గ్రామాల్లో పర్యటించి విద్యార్ధులకు చేతనైన సాయం చేశారు. నల్గొండ జిల్లాలోని  రెండు గ్రామాల్లో, వరంగల్ జిల్లాలోని ఒక ఊరిలో, మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక విలేజ్ లో విద్యార్ధులకు మెటీరియల్ అందజేశారు. ఇప్పటిదాకా ఎనిమిదిన్నర లక్షల విలువైన ఐటెమ్స్ విరాళంగా ఇచ్చారు. జానికి కార్ పూలింగ్ గ్రూపులు సిటీలో చాలానే ఉన్నాయి. అవన్నీ పక్కా మనీ సేవింగ్ కాన్సెప్టుతో నడుస్తున్నవే. కానీ టెక్కీ రైడ్ ఉద్దేశం వెనుక ఒక మంచి సోషల్ కాజ్ ఉండటం అందరినీ ఆకర్షిస్తోంది.

- Advertisement -