భారత్‌లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ, ఉగ్రసంస్థలకు అడ్డాగా మారిన పాక్ బండారం మరోసారి బయటపడింది. పాకిస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ (70) భారత్‌పై మరోమారు విషం కక్కాడు. అంతేకాకుండా పనిలో పనిగా అమెరికాపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అమెరికా తనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్ని నిందించాడు.
ఇక ‘‘భారత్ అధీనంలో ఉన్న కశ్మీర్‌లో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు వెల్లివిరిసే వరకు మా పోరాటం ఆగదు’’ అని సలాహుద్దీన్ స్పష్టం చేశాడు. ఓ పాక్ టీవీ ఛానెల్‌తో ఇంటర్వ్యూలో పాల్గొన్న సలాహుద్దీన్ తనను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం వెనక ఇజ్రాయెల్, ఇండియా ఉన్నాయన్నారు.
అందుకే పాక్‌పై ఉన్న ద్వేషాన్ని ఇలా తీర్చుకున్నాయని పేర్కొన్నాడు. అమెరికా ప్రకటనను మతిలేని, తెలివిలేని ప్రకటనగా అభివర్ణించాడు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ఆ దేశ కోర్టులు కూడా చెత్తబుట్టలో పడేస్తున్నాయని, పాశ్చాత్య దేశాలు కూడా పట్టించుకోవడం లేదని సలాహుద్దీన్ ఆక్షేపించాడు.
ఇదిలా ఉంటే…భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సలాహుద్దీన్ స్వయంగా అంగీకరించాడు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అగ్ర రాజ్యం అమెరికా సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సలాహుద్దీన్ ఓ పాక్ టీవీ ఛానెల్‌తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత భూభాగంలో ఉగ్రదాడులు చేసినట్టు స్పష్టంచేశారు. ఇప్పటివరకు భారత భద్రతా దళాలపైనే తమ దృష్టిని కేంద్రీకరిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు చెప్పారు.
కశ్మీరే తన ఇల్లు అని చెప్పిన సలాహుద్దీన్.. బుర్హాన్‌వనీ మృతితో కశ్మీర్‌లోయ అశాంతికి సాక్షీభూతంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. తనకు భారత్‌లో అనేకమంది మద్దతుదారులు ఉన్నారని, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆయుధాలు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు.
భారత్‌లో ఎన్నో ఉగ్రదాడులకు పాల్పడినప్పటికీ 9/11 ఘటన తర్వాత ప్రపంచ దృక్పథం మారిందని చెప్పారు. అంతేకాకుండా భారత్‌లో తమకు అన్ని ప్రాంతాలూ లక్ష్యంగా ఉన్నట్టు చెప్పారు.