అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ప్రత్యేక నిధి ద్వారా వేతనాలు చెల్లించేందుకు మంత్రి వర్గ ఉప సంఘం ఆమోదం తెలిపింది. ప్రత్యేక మూల నిధి ద్వారా ప్రతి నెల నేరుగా వేతనాలు వారి ఖాతాల్లో జమా అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వర్గ ఉప సంఘం వెల్లడించింది. దీని కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ప్రభుత్వం సహాయం కూడా తీసుకోనున్నట్లు మంత్రుల బృందం తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే ఆలయ ఉద్యోగులు, అర్చకులకు రూ. 8,000, పట్ణణ ప్రాంతాల్లో పని చేసే వారికి రూ.10,000, కాంట్రాక్టు / NMR బేసిస్ మీద పని చేసే రెగ్యులర్ ఉద్యోగులకు రూ.12,000 లను వారు పని చేసే ప్రాంతం, వర్క్ లోడ్ ఆధారంగా కనీస వేతనంగా నిర్ణయించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.దీని కోసం ప్రభుత్వ సహాయంతో ప్రస్తుతమున్న చట్టాలకు సవరణలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి, దేవాదాయ శాఖను పటిష్టపరచడం, అర్చకులు, ఆలయ ఉద్యోగుల జీత భత్యాలతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు సచివాలయంలో మంత్రి వర్గ ఉప సంఘం మంగళవారం భేటీ అయింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్ తో పాటు ప్రభుత్వ సలహాదారు రమణ చారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి శివ శంకర్ తో పాటు ఇతర అధికారులు పాల్గోన్నారు. దేవాదాయ శాఖలో పని చేస్తున్న ఆలయ ఉద్యోగులు,అర్చకుల వేతనాలు ప్రధాన ఎజెండగా చర్చించిన క్యాబినెట్ సబ్ కమిటీ దేవాదాయ శాఖను పటిష్టపరిచేందుకు మరికొన్నిప్రతిపాదనలను ప్రతిపాదిచింది. క్యాబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలకు సంబందించిన డ్రాఫ్ట్ ఫైల్ ను రెండు వారాల్లో ముఖ్యమంత్రికి నివేదిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.
క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు / ప‌్రతిపాదనలు
1. అర్చకులు,ఆలయ ఉద్యోగులకు వేతన చెల్లింపులకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతి నెల వారి ఖాతాల్లో వేతనాలు జమ అయ్యేట్లు చర్యలు.
2. యాక్టు నెం.17/ 1966 ప్రకారం వారసత్వ అర్చక నియామకాలను చట్ట ప్రకారం చేపట్టడం.
3. దేవాదాయ శాఖ కమిషనర్ ఆమోదం లేకుండా దేవాదాయ శాఖలో ఎలాంటి నియామకాలను చేపట్టడానికి వీలు లేదు.
4. సిటీ సివిల్ కోర్టు ఇచ్చే డిక్రీల మాదిరిగానే దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాలు అమలు అయ్యేలా చట్ట సవరణ.
5. దూప దీప నైవేద్య పథకాన్ని కొత్తగా మరో 1200 ఆలయాలకు వర్తింపజేయడం. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిధ్దం చేయాలని దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశం. ( గతంలో రూ.2500 గౌరవ వేతనంగా ఇవ్వగా తెలంగాణ ప్రభుత్వం దాన్ని రూ.6000 పెంచుతూ గతంలోనే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 1805 ఆలయాల్లో పని చేసే అర్చకులకు దూప దీప నైవేద్య పథకం ద్వారా గౌరవ వేతనం అందుతుంది)
6. ఆలయ భూములను పరిరక్షించేందుకు తీసుకోవల్సిన చర్యలపై కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి వర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా రిజిస్ట్రార్ (స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్) , ఎస్ఈ (ఆర్ ఆండ్ బీ) , మున్సిపల్ కమిషనర్,ఇతర శాఖల అధికారులు సభ్యులుగా కమిటీ.
7. భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట . ప్రసిధ్ద ఆలయాల్లోభక్తుల కోసం సేవ టికెట్స్ , విడిది, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తేవడం. దశల వారీగా ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం.
8. దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న స్తపతి, ఇంజనీర్లు, ఇతర పోస్టులను భర్తీ చేయడం.
9. సాధ్యమైనంత త్వరగా ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేయడం.
10.ఫిలిగ్రీమ్ టూరిజాన్ని అభివృద్ది చేయాలి. దీని కోసం పర్యాటక శాఖతో పాటు ఇతర విభాగాలతో దేవాదాయ శాఖ సమన్వయం చేయడం.