తెలుగుసాహిత్యానికి వన్నె తెచ్చిన ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, సాహితీ మూర్తి ఆచార్య సి. నారాయణరెడ్డి మధురమైన కవిత్వం, వినసొంపైన గీతాలు ఇక వినలేం.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సి.నారాయణరెడ్డి ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. సినారే మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంధర్బంగా ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు కేసీఆర్. సినారే రాసిన ‘ఎందెందు వెదికినా’ పద్యంపై సమగ్రమైన విశ్లేషణ రాసి ఎంఏలో ఉండగా బహుమతి సాధించానని గుర్తు చేసుకున్నారు సీఎం. సినారే రచనలు అన్ని తరాలవారిని ఆకట్టుకున్నాయన్న సీఎం.. ఆచార్య జయశంకర్, సినారే ఒకే తరానికి చెందిన వారని పేర్కొన్నారు. ఉర్దూ మీడియంలో విద్య సాగించిన సినారే ఎంఏలో తెలుగు తీసుకుని సాహసం చేశారని ఆయన పేర్కొన్నారు. సినారే రచనలు తెలుగువారందర్నీ అలరించాయని ఆయన కొనియాడారు. సాహిత్య రంగంలో సీనారే చేసి కృషి ఎప్పటికీ మరిచిపోలేనిదని సీఎం చెప్పారు. అధ్యాపకుడిగా, సాహితీవేత్తగా, కవిగా, సినీ గేయ రచయితగానే కాకుండా రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన సేవలందించారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.
సి.నారాయణరెడ్డి తన కలంపేరు ‘సినారే’తో తెలుగు పాఠక, సినీ ప్రేక్షక లోకానికి సుపరిచితులు. 1931 జూలై 29న కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో రైతు దంపతులు మల్లారెడ్డి, బుచ్చమ్మలకు సీనారే జన్మించారు. ఆయనది బాల్య వివాహం కాగా, సతీమణి పేరు సుశీల. సినారేకు నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి ఉన్నారు. ఆయన రచించిన విశ్వంభర కావ్యానికి గాను 1988లో ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం ఆయన్ను వరించింది. 1977లో ఆయన భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. సినారే మృతిచెందడంపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

