వేసవిలో మజ్జిగ తాగితే ఎన్ని ప్రయోజనాలో!

21
- Advertisement -

మండే వేసవిలో చల్లని పానీయాలు సేవించడం మామూలే. వేసవి తాపం నుంచి బయట పడేందుకు కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్ సలాడ్.. ఇలా చాలా రకాల పానీయాలే సేవిస్తుంటారు. వీటితో పాటు మజ్జిగ కూడా వేసవిలో ఎంతో మంది ఇష్టంగా తాగుతూ ఉంటారు. అయితే మజ్జిగ పాల సంబంధిత పానీయం కావడంతో కొంతమంది ఎలర్జీగా ఫీల్ అవుతుంటారు. నిజానికి వేసవిలో మజ్జిగ తప్పనిసరిగా సేవించాల్సిన పానీయం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్య పరిచే పోషకాలు మెండుగా ఉంటాయి. తద్వారా డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యల బారినుంచి కాపాడడంలో మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది. ఇంకా మజ్జిగలో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది, తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి. .

ఇంకా పొటాషియం, విటమిన్ బి12, విటమిన్ సి వంటివి కూడా లభిస్తాయి. తద్వారా రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరంలోని ఇతరత్రా సమస్యలు కూడా దూరమౌతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ మజ్జిగ తాగితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందట. ఇంకా మజ్జిగ తాగడం వల్ల జీర్ణ వృద్ధి మెరుగు పడుతుంది. అంతే కాకుండా ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, గ్యాస్.. వంటి సమస్యలు కూడా దూరమౌతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కేవలం మజ్జిగ మాత్రమే కాకుండా అందులో కొత్తిమీర, నిమ్మరసం వంటివి కలుపుకొని తాగితే మరి మంచిదట. కొత్తిమీరలో ఉండే యాంటీబయోటిక్ గుణాలు, నిమ్మరసంలో ఉండే సిట్రిక్ ఆమ్లం శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో సహాయపడతాయట. కాబట్టి వేసవిలో ఇతరత్రా కూల్ డ్రింక్స్ సేవించడం కంటే రోజుకు రెండు లేదా మూడు గ్లాసుల మజ్జిగ తాగితే వేసవిలో ఎదురయ్యే అన్ని సమస్యల నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

Also Read:KCR:రంజిత్ రెడ్డికి బుద్ది చెప్పండి

- Advertisement -