ఐపీఎల్10లో బాగంగా శనివారం గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు.. సూపర్ ఓవర్లో అనూహ్య విజయాన్నందుకుంది. 154 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన ముంబై విజయం సులువే అనుకున్నారు. ఒకదశలో 16 ఓవర్లో 123/4 స్కోరుతో గెలుపు ఖాయంగా కనిపించింది. పార్థివ్ పటేల్ మెరుపులతో ముంబయి అలవోకగా గెలిచేలా కనిపించింది. బట్లర్ (9), రాణా (19), రోహిత్ (5) విఫలమైనప్పటికీ పార్థివ్ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడటంతో ముంబయి లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. 4 ఓవర్లో 31 పరుగులు చేస్తే గెలుపు ముంబైతో. అంతలోనే గుజరాత్ మళ్లీ పుంజుకుంది. పొలార్డ్ (15), కృనాల్ పాండ్య (29)లను ఔట్ చేసి మ్యాచ్ తనవైపు తిప్పుకున్నారు లయన్స్ బౌలర్లు. ఫాల్క్‌నర్, తంపి కట్టుదిట్టంగా బంతులేస్తూ 3 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీయడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. ఐతే ఇర్ఫాన్ వేసిన చివరి ఓవర్లో 11 పరుగులు అవసరమవగా తొలి బంతికి కృనాల్ సిక్సర్ బాదడంతో ముంబయి తేలిగ్గా గెలిచేలా కనిపించింది. కానీ మూడో బంతికి బుమ్రా రనౌటవగా.. 4 బంతుల్లో 4 పరుగులే వచ్చాయి. చివరి బంతికి ఒక్క పరుగే అవసరమవగా జడేజా కళ్లు చెదిరే రీతిలో కృనాల్‌ను రనౌట్ చేయడంతో ముంబయి ఆలౌటైంది. మ్యాచ్ టైగా ముగిసి.. సూపర్ ఓవర్‌కు మళ్లింది.
సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి11 పరుగులు చేసింది. గుజరాత్ గెలుపు ఖాయం అనుకన్నారంతా… అందులోనూ విధ్వంసక ఆటగాళ్లు ఫించ్, మెక్‌కలమ్ క్రీజులో ఉన్నారు. తొలి బంతికే నోబాల్ వేశాడు బుమ్రా. రెండో బంతికి మళ్లీ వైడ్ కూడా పడింది. ఇలాంటి స్థితిలో గెలుస్తుందని ఎవరైనా అనుకుంటారా..? కానీ ఆ జట్టు గెలిచింది. ఒక నోబాల్, వైడ్ వేసినా ఏమాత్రం ఒత్తిడికి గురికాని బుమ్రా.. కళ్లు చెదిరే బంతులతో ఫించ్, మెక్‌కలమ్‌లను కట్టి పడేశాడు. ఒక్క బౌండరీకి అవకాశం ఇవ్వకుండా కేవలం ఆరే పరుగులిచ్చి.. ముంబయికి విజయాన్ని కట్టబెట్టాడు. ఇప్పటిదాకా ఐపీఎల్ చరిత్రలో సూపర్ ఓవర్లో ఫలితం తేలిన మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ఓవర్ ఇదే అంటే అతిశయోక్తి లేదు.
అంతకుముందు గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్‌కు యువ ఆటగాడు ఇషాన్ కిషన్ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్‌కు వరుస కట్టేశారు. మెక్లెనగన్ వేసిన మూడో ఓవర్లో అతను వరుసగా 6, 4, 4 బాదాడు. హర్భజన్‌కు కూడా బౌండరీలతో స్వాగతం పలికాడు. ఐతే మరో ఎండ్‌లో ఇషాన్‌కు సహకరించేవారే కరవయ్యారు. విధ్వంసక ఆటగాళ్లయిన మెక్‌కలమ్ (6), రైనా (1), ఫించ్ (0) పవర్ ప్లే లోపే పెవిలియన్ చేరిపోయారు. దినేశ్ కార్తీక్ (2) కూడా నిలవలేదు. వీళ్లు ఔటవడంతో ఇషాన్ కూడా జోరు తగ్గించేయాల్సి వచ్చింది. చివరి అతను 12వ ఓవర్లో వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 83 పరుగులే. ఐతే జడేజా (28), టై (25), ఫాల్క్‌నర్ (21) తలో చేయి వేయడంతో లయన్స్ స్కోరు 150 దాటింది.