BRS:కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ

9
- Advertisement -

రేపు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ శాసనసభా పక్షం (ఎల్పీ) సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

ఈ భేటీలో ప్రధానంగా ఏపీ చేపడుతున్న జల దోపిడీ, అలాగే తెలంగాణ సాగునీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై కేసీఆర్ తీవ్రంగా మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నదుల అనుసంధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని, దీనివల్ల తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతోందని కేసీఆర్ ఆరోపించనున్నారని సమాచారం.

ప్రత్యేకంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేవలం 45 టీఎంసీల నీటి కేటాయింపునకు ఒప్పుకోవడంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 91 టీఎంసీల నీటిని కేటాయించగా, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ముందు మోకరిల్లిందని విమర్శలు గుప్పించనున్నారు. తెలంగాణ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొననున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం మరో ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఉద్యమ కార్యాచరణ, ప్రజల్లోకి వెళ్లే విధానం, భవిష్యత్ పోరాటాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారని తెలుస్తోంది.

Also Read:MSG:చిరంజీవి ఎక్స్‌క్లూజివ్ స్టిల్

అదే విధంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ బలోపేతం, రానున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాల్సిన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -