మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ అద్భుతంగా గెలవబోతుందని.. అందులో ఎలాంటి డౌట్ లేదని ధీమా వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. ఎవరెన్ని కథలు చెప్పినా.. ఏం మాట్లాడినా.. పోయినసారి కంటే ఇంకో ఐదు ఎక్కువ సీట్లతోని బీఆర్‌ఎస్ గెలువబోతుందని అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ప్రగతి నివేదన సభలో పాల్గొని.. సభకు హాజరైన అశేష జనవాహిని ఉద్దేశించి ప్రసంగించారు బీఆర్ఎస్ అధ్యక్షులు, సీఎం కేసీఆర్. తాము చెప్పేటివి కట్టుకథలు, పిట్టకథలు కావని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కల్యాణలక్ష్మీ రోజూ మీరు చూస్తూనే ఉన్నారు. రైతుబీమా చూస్తూనే ఉన్నారు? ధాన్యం అమ్మితే డబ్బులు ఎట్ల వస్తున్నయో మీకు తెలుసు. 24 గంటల కరెంట్ ఎట్ల వస్తుందో మీకు తెలుసు. ఏ విధమైన ప్రజాసంక్షేమం ఉందో మీకు తెలుసు. ఇవన్నీ మీ కండ్ల ముందు జరగుగుతున్నయ్ అని గుర్తుచేశారు. వీటిగురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరైనా, ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా అని ప్రశ్నించారు. నేలవిడిచి సాము చేసినట్టు డైలాగులు చెప్పి పిచ్చి లేపి పోయిండ్రు తప్ప.. ప్రజల బాధలు ఏంటనేది పట్టించుకున్న వాళ్లు మాత్రం లేకుండే అని అన్నారు.
ఇప్పుడు ఉన్న సదుపాయాలన్నీ ఇంకా మెరుగవ్వాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక్కడికే సంతోషపడవద్దని.. ఇవి ఇంకా పెరగాలి.. ఇంకా ముందుకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఇవన్నీ జరగాలంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలవాలన్నారు. ఇంకా అద్భుతాలు జరగాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్ మారిపోయే పరిస్థితులు కనబడుతున్నాయని.. పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని.. సంక్షేమం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇప్పుడొచ్చి ఏది పడితే అది చెబుతారని.. ఆపద మొక్కులు మొక్కుతారని అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించడంతో మోసపోతే గోసపడాల్సి వస్తుందని హెచ్చరించారు. మీమీ గ్రామాల్లో విచక్షణతో చర్చ జరిపి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రజలకు సూచించారు.
సూర్యాపేటలో ఇంత పెద్ద సభ జరిగిందంటే.. నలుగురు ఎమ్మెల్యేలు గెలిచినట్టే అని అర్థమవుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. మరోసారి బీఆర్‌ఎస్ పార్టీ అద్భుతంగా గెలవబోతుందని.. అందులో ఎలాంటి డౌట్ లేదని ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కథలు చెప్పినా.. ఏం మాట్లాడినా.. పోయినసారి కంటే ఇంకో ఐదు ఎక్కువ సీట్లతోని బీఆర్‌ఎస్ గెలువబోతుందని జోస్యం చెప్పారు. అందులో ఏ మాత్రం అనుమానం లేదని.. మరింత ముందుకుపోదామని అన్నారు.
ధరణి అంటే భూములపై రైతులకు అధికారం అప్పగించడమే అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇవాళ రైతు భూమిని మార్చాలంటే ముఖ్యమంత్రికి కూడా ఆ అధికారం లేదని.. ఆ పవర్ ఒక్క మీ బొటనవేలుకే ఉందని స్పష్టం చేశారు. ఈ అధికారాన్ని ఉంచుకుంటారా? మల్ల పోగొట్టుకుంటారా? అనేది ఆలోచించుకోవాలని రైతులకు సూచించారు.
‘ఇవాళ ధరణి ఎందుకు తెచ్చినం.. వీఆర్‌వోలను తీసేసినం. వాళ్లతో నాకేమైనా పాలి పగనా? ఎందుకు తీసేసినం? పనిలేకనా?’ అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఎల్లయ్య భూములు మల్లయ్యకు రాసి.. మల్లయ్య భూమి భూమయ్యకు రాసి.. భూమయ్య భూమి ఇంకో ఎల్లయ్యకు రాసేటోళ్లు. భూములు ఉల్టా రాసుడు.. గట్ల ఎట్ల అయ్యిందని అడిగితే.. అయ్యిందేదో అయ్యింది.. వట్టిగనే అయితదా అని రైతుల నుంచి డబ్బులు గుంజేటోళ్లు అని ఆనాటి పరిస్థితులను గుర్తు చేశారు. ఒకనాడు నల్లగొండ జిల్లాలో 15 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉండేవని.. అదే ఇవాళ 87 రిజిస్ట్రేషన్ ఆఫీసులు అయ్యాయని తెలిపారు. ధరణి వచ్చిన తర్వాత 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్. ఆ తర్వాత 5 నిమిషాల్లోనే మ్యుటేషన్ అయ్యి.. ఆ వెంటనే సైట్ మీద వచ్చేస్తున్నదని తెలిపారు.
‘ ఇవాళ రైతుబంధు డబ్బులు పంపిస్తున్నం. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే రైతుభీమా డబ్బులు పంపిస్తున్న. కుటుంబ పెద్ద చనిపోతే.. ఆ కుటుంబం బజారున పడొద్దని రూ.5లక్షల బీమా అందిస్తున్నాం. దాని ప్రీమియం మొత్తం కూడా సర్కారే భరిస్తున్నది. కానీ కాంగ్రెస్ రాజ్యంలో ఉన్న ఆపద్భాంధువును యాది చేసుకోండ్రి.. పైసల కోసం ఎన్ని రోజులు, ఎన్నేండ్లు తిరిగామో గుర్తుచేసుకోండ్రి. ధరణి ఉంది కాబట్టే అక్కడ బ్యాంకుల పైసలు పంపిస్తే.. మీ సెల్‌ఫోన్లు మోగుతున్నయి. రైతుబంధు కోసం ఎవడి దగ్గర చెయ్యి చాపకుండా.. పాణి నకలు లేకుండానే అకౌంట్లలోకి డబ్బులు వచ్చి పడుతున్నయి.’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. వడ్లు అమ్మిన పైసలు ఇప్పుడు సీదా బ్యాంకులకొచ్చి పడుతున్నయని అన్నారు. ఇంతకుముందు పంట పైసల కోసం బీట్ల కాడికి.. సేట్ల కాడికి, గిర్నీల కాడికి.. నెలలు నెలలు తిరగాల్సిన పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ అంటుందని.. తీసేసి మళ్లీ పాత పద్ధతి పెడతారా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. పాత పద్ధతి పెడితే కథ మళ్లీ మొదటికొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఓట్లు వస్తే ఆగమాగం కావద్దని.. స్థిరంగా ఆలోచించాలని సూచించారు. ఓటు అనేది మన రాతను రాసుకునే గొప్ప ఆయుధం అని.. దాన్ని అట్లాగే వాడుకోవాలని సలహా ఇచ్చారు.
‘ ధరణి అంటే అసలు ఏంటో ఒక్కటే మాటలో చెబుతా.. ఇంతకుముందు రైతుకు వీఆర్‌వో ఒక భర్త. ఆర్‌ఐ ఒక భర్త. ఎంఆర్‌వో ఒక భర్త. ఆర్డీవో ఒక భర్త. జాయింట్ కలెక్టర్ ఒక భర్త. జిల్లా కలెక్టర్ ఒక భర్త. హైదరాబాద్ సచివాలయంలో రెవెన్యూ సెక్రటరీ ఒక భర్త. అతని మీద రెవెన్యూ మంత్రిది ఒక పెత్తనం. ఇండ్ల ఎవరు ఒకరు కిందామీద చేసినా పెద్ద పాము మింగినట్టే.. మల్ల మొదటికొస్తది. ఇయ్యాల ఆ పరిస్థితి ఉందా? ఒక్కసారి ధరణిల భూమి ఎక్కితే దాన్ని మార్చే మొనగాడు ఎవరైనా ఉన్నడా? ఇంతమంది భర్తలు.. ఇంతమంది పెత్తనం తీసేసి రైతులకు అప్పగించడమే ధరణి అర్థం. ఇవాళ రైతు భూమి మార్చాలంటే ముఖ్యమంత్రికి, సీఎస్‌కు కూడా పవర్ లేదు. జిల్లా కలెక్టర్‌కు, ఏ మంత్రికి పవర్ లేదు. మీ బొటనవేలుకే ఆ పవర్ ఉన్నది. అంటే తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీకు ఆ పవర్ ఇచ్చింది ప్రభుత్వం. నువ్వు గిఫ్ట్ ఇస్తావా? అమ్ముకుంటావా? ఆ అధికారం మొత్తం నీ బొటనవేలుకే ఉంది.’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
Also Read:చంద్రుడిపై కూలిన రష్యా లూనా-25..
‘ రైతన్నలారా ఆలోచన చేయిండ్రి. మీకు ఉన్న అధికారాన్ని ఉంచుకుంటరా? మల్ల పోగొట్టుకుంటరా? మల్ల పైరవీకారుల మందలపాలైతరా? దయచేసి చర్చచేయిండ్రి. వట్టిగనే ఆగమాగం కావద్దు. మల్ల కాంగ్రెస్‌కు వస్తే మల్ల పైరవీకారులు వస్తరు. ఒక్కో ఎమ్మార్వో ఆఫీసు కాడ, రిజిస్ట్రేషన్ ఆఫీసుల కాడ గంటలు గంటలు పడిగాపు కాయాలి. రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పోవాలంటే సద్దులు కట్టుకుని పోవాలి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎంత సులభంగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది? ఎంత సులభంగా మ్యుటేషన్ అయిపోతుంది. ఏ విధంగా ధాన్యం అమ్మిన పైసలు వస్తున్నయ్. ఏ విధంగా వస్తుందనేది ఆలోచన చేయిండ్రి’ అని సూచించారు.
ఓట్లు, ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దని ప్రజలకు సీఎం కేసీఆర్ సూచించారు. ఎన్నికలు రాగానే పంట కల్లాలకు అడుక్కునేటోళ్లు వచ్చినట్టు వస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన సూర్యాపేట ప్రగతి నివేదన సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. ఈ 50 ఏండ్లలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నిలదీశారు.
‘ ఇవాళ బరిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉన్నాయని.. వీళ్లేమైనా మనకు కొత్తవాళ్లా? లేక ఈ మధ్య ఏమైనా ఆకుపసరు తాగొచ్చారా? అని ప్రశ్నించారు. ఒక్క అవకాశం కావాలని వాళ్లు అడుగుతున్నారని.. ఎన్ని అవకాశాలు ఇవ్వాలని అడిగారు. ఒకటి కాదు రెండు కాదు 50 ఏండ్లు అవకాశం ఇచ్చారని అన్నారు. కేసీఆర్ కంటే దొడ్డు, ఇంక పొడువు ఉన్నోళ్లు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యిండ్రు. ఈ జిల్లా నుంచి కూడా మంత్రులు అయ్యిండ్రు. ఎన్నడైనా సూర్యాపేటలో మెడికల్ కాలేజీ పెట్టాలి. నల్లగొండలో మెడికల్ కాలేజీ పెట్టాలి. భువనగిరిలో మెడికల్ కాలేజీ పెట్టాలే అని ఆలోచన చేసిండ్రా. మళ్ల వాళ్లకు ఎందుకు ఓటేందుకు వెయ్యాలి.’ అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. మా భూపాల్ రెడ్డి.. నన్ను, మున్సిపల్ మంత్రిని, జిల్లా మంత్రిని తీసుకెళ్లి నల్గొండను అభివృద్ధి చేశారని అన్నారు. మునుపు ఎట్లుండే.. ఇప్పుడెట్ల అయ్యిందో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఇలా అభివృద్ధి చేయాలని.. 50 ఏండ్లు రాజ్యం చేసిన కాంగ్రెస్ ఎందుకు ఆలోచన చేయలేదని ప్రశ్నించారు. జిల్లాలో మంత్రులు లేకుండేనా? అప్పుడు ఎందుకు చేయలేదని నిలదీశారు.
‘రైతాంగం సచ్చిపోతుంటే.. ఆపద్భంధువు అని పెట్టి 50వేలు మన మొకాన కొడితే అవి కూడా వచ్చేవి కాదు. అది కూడా ఆర్నెల్లు తిరిగితే 10వేలు, 20వేలు చేతుల పెట్టి పంపేటోళ్లు. రైతుల కష్టాలు తీర్చాలి. ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలి. వాళ్లకు కనీస మద్దతు ధర ఇప్పించాలె అని ఎన్నడైన ఆలోచన చేసిండ్రా. ప్రజలను, రైతులను ఎట్ల చూసేటోళ్లు. ఆఫీసుల ముందుకెళ్తే.. కరిచినట్టు మాట్లాడేటోళ్లు.’ అని సీఎం కేసీఆర్ అన్నారు. అప్పుడు.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల గురించి ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు.
‘ ఓట్లు, ఎలక్షన్లు రాగానే ఆగమాగం కావద్దు. మనకు కులం లేదు. జాతి లేదు. మతం లేదు. ఏ ఒక్కరిని విస్మరించకుండా.. అందర్నీ కడుపులో పెట్టుకుని.. కాపాడుకుంటూ వెళ్తున్నం. మన పరిస్థితి ఎట్ల పెరిగితే అట్ల పోతున్నం. కల్యాణలక్ష్మీ ప్రారంభించినప్పుడు మొదట 50వేలే పెట్టుకున్నం. అప్పుడు మన పరిస్థితి మనకే తెలియదు. ఆ తర్వాత పెంచుకున్నం. పెన్షన్ పెట్టుకుంటే మొదట ఒక్క వెయ్యి మాత్రమే ఇచ్చుకున్నం. కానీ తర్వాత రూ.2,016 చేసుకున్నం. సర్కారు నడిపించుడంటే సంసారం నడిపినట్లే ఉంటది. మన ఇల్లు వాకిలి నడిపించినట్లే ఉంటది. వంగును బట్టి, వైపును బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ 50 ఏండ్ల రాజ్యం చేసిన కాంగ్రెస్ ఇప్పుడేం చెబుతుంది. వాళ్ల జన్మల రూ.500 కూడా పెన్షన్ ఇవ్వలేదు. కేవలం 200 మొఖాన కొట్టిన కాంగ్రెస్.. మాకు ఛాన్స్ ఇవ్వుండ్రి.. అడుగుతున్నరు. రూ.4వేలు పెన్షన్ ఇస్తామని చెబుతున్నరు. వాళ్లు పరిపాలిస్తున్న ఛత్తీస్‌గఢ్‌లో అంత పెన్షన్ ఇస్తున్నరా? కర్ణాటకలో ఇస్తున్నారా? రాజస్థాన్‌లో ఇస్తున్నారా? అంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి ఓ నీతి ఉంటుందా? అంటే ఏమన్నట్టు? నాకు నోరు లేదా? నాకు చెప్పరాదా? వాళ్లు నాలుగిస్తే.. నేను రూ.5 ఇస్తా అని అనరాదా? ఇదేమైనా అర్రాస్ పాటనా? కాదు కదా? బాధ్యతతో బ్రహ్మాండంగా తీసుకెళ్లాలి. అన్నీ రావాలి. అన్ని కలగాలి. తప్పకుండా మనం కూడా పెన్షన్ పెంచుదాం. ప్రకటిస్తా ముందు ముందు. ‘ అని చెప్పుకొచ్చారు.
‘ ఒకనాడు మోటార్ కాలిపోతే మన బతుకు ఎట్లుండె. మనిషికి మూడు వేలు వసూలు చేసి ట్రాన్స్‌ఫార్మర్లు తెచ్చేటోళ్లు. ఇవాళ రైతులను ఎన్ని హెచ్‌పీలు పెట్టినవ్? ఎన్ని మోటార్లు పెట్టినవ్? నీళ్లు ఎక్కడి నుంచి తీసుకుంటున్నవ్ అని అడిగేటోళ్లు ఉన్నరా? 50 ఏండ్ల కాంగ్రెస్‌లో ఎప్పుడైనా చూసినమా? కానీ ఇదే కాంగ్రెస్, ఇదే బీజేపీ ఏం మాట్లాడుతున్నయి? ఒకడేమో మోటార్లకు మీటర్లు పెట్టాలని అంటరు? ఇంకొకడేమో మూడు గంటల కరెంట్ చాలని అంటడు. కర్ణాటకలో మొన్న కాంగ్రెస్‌ను గెలిపిచ్చిండ్రు. అయింత కరెంట్ ఎత్తేసిండ్రు. గ్రామాలే కాదు బెంగళూరు సిటీలో కూడా కరెంట్ కోతలు విధిస్తున్నరు. ఏడు గంటల కరెంట్ ఇస్తే.. పొద్దున మూడు గంటలు, రాత్రి నాలుగు గంటలు ఇస్తుండ్రు. ఎనకట మనం పడ్డ బాధనే ఇప్పుడు వాళ్లు పడుతుండ్రు. పాములు కరుసుడు.. తేళ్లు కరుసుడు. సచ్చిపోవుడు. అంతా జరగుతుంది. మల్ల గా గతే మనకు కూడా రావాల్నా? ఈ 24 గంటల కరెంటే ఉండల్నా?’ అని అన్నారు.
Also Read:CM KCR:అభివృద్ధిలో తెలంగాణ నెంబర్ 1