బిఆర్ఎస్ హయాంలోనే మూసీ ప్రణాళికలు సిద్ధం చేశాం..

3
- Advertisement -

మూసి నది ప్రక్షాళన, సుందరీకరణ అంశంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మూసి ప్రక్షాళనకు సంబంధించిన ప్రణాళికలు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సిద్ధం చేశామని తెలిపారు. మొదటి దశలో భాగంగా 32 ఎస్టీపీలను నిర్మించామని, రెండో మరియు మూడో దశల్లో మరో 60 ఎస్టీపీలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. మూసి సుందరీకరణతో పాటు ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలు కూడా రూపొందించామని ఆయన వివరించారు. అయితే సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా సుమారు 11 వేల కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు.

మూసి ప్రక్షాళన పేరుతో ప్రస్తుతం భారీ అవినీతి జరుగుతోందని కూడా సుదీర్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలు ఖరారు కాలేదని, రోజుకో మాట చెప్పుతూ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు.

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ సమస్య వచ్చినా కేటీఆర్ అక్కడికి వెళ్లి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నాడు కెసిఆర్ ఎప్పుడూ చెప్పేవారని ఆమె గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలను ఇబ్బంది పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పడం సరైంది కాదని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకులు మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు.

కేటీఆర్ మాట్లాడుతూ మూసి అభివృద్ధి కోసం ఎవరి ఇళ్లను కూడా కూల్చాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో నాగోల్ వద్ద 320 ఎంఎల్డీ సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీని నిర్మించామని తెలిపారు. మూసి ప్రక్షాళన కోసం మూడు దశల్లో ప్రాజెక్టును రూపొందించి, మొదటి దశలోనే 32 ఎస్టీపీలను నిర్మించామని చెప్పారు. సుమారు రూ.4000 కోట్లతో మొదటి దశ పనులు పూర్తి చేశామని వివరించారు.

అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా నీటిని గండిపేట లేక్ వరకు తరలించి, అక్కడి నుంచి మూసిలోకి పంపాలని ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. దీనికి సుమారు రూ.11 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశామని చెప్పారు. మూసిపై రూ.545 కోట్లతో 15 వంతెనలు నిర్మించి వాటి కింద చెక్‌డ్యాంలు ఏర్పాటు చేయాలని కూడా ప్రణాళిక చేశామని పేర్కొన్నారు.

Also ReadIran: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా

ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రూ.1.5 లక్షల కోట్లతో మూసి ప్రక్షాళన చేస్తామని చెబుతోందని కేటీఆర్ విమర్శించారు. రూ.16 వేల కోట్లలో పూర్తయ్యే పనులకు ఇంత భారీ బడ్జెట్ ఎందుకు కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పూర్తి డీపీఆర్ కూడా సిద్ధం కాలేదని అన్నారు.

మూసి పరిసరాల్లో నివసిస్తున్న లక్షా యాభై వేల కుటుంబాలు భయాందోళనల మధ్య జీవిస్తున్నాయని, వారి తరఫున పోరాడతామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. పేదల ఇళ్లను కూల్చకుండా మూసి సుందరీకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ ప్రాజెక్టును తమకు అప్పగిస్తే తాము సుందరీకరణ చేసి చూపిస్తామని కూడా సవాల్ విసిరారు.

- Advertisement -