తెలంగాణలో రాజకీయంగా పట్టు పెంచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై పార్టీ అధిష్ఠానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా నవంబర్ నెలలో నాలుగు భారీ బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సభలు జరగనున్నాయి.
రైతుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ఈ సభలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 1న ఆదిలాబాద్‌లో రైతు గర్జన సభతో ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అనంతరం నవంబర్ 11న నిర్మల్‌లో రైతు గర్జన నిర్వహించనున్నారు. నవంబర్ 19న నిజామాబాద్‌లో మరో రైతు గర్జన సభ జరగనుంది.
Also Read:జానపద రిథమ్ ప్లేయర్లతో ‘ఎల్లమ్మ’
ఇక నవంబర్ 29న కరీంనగర్‌లో దీక్షా దివస్ సభను నిర్వహించనున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలకమైన దీక్షా దివస్‌ను పురస్కరించుకుని ఈ సభను భారీ స్థాయిలో నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
వరుస సభల ద్వారా ఉత్తర తెలంగాణలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతో పాటు ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

