అరచేతిలో స్వర్గం… మోచేతికి బెల్లం: సతీష్ రెడ్డి

12
- Advertisement -

రాష్ట్రంలో వరి పండించిన రైతులకు రేవంత్ సర్కారు తీరని ద్రోహం చేసింది. వరి పండిస్తే బోనస్ ఇస్తామని చెప్పి నిండా ముంచింది అని మండిపడ్డారు రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి . ఇప్పుడు అసెంబ్లీలో ఏకంగా గవర్నర్ తో అబద్దాలు చెప్పించింది. కానీ అక్కడే కొన్ని వాస్తవాలు కూడా బట్టబయలయ్యాయి. రాష్ట్రంలోని రైతులందరికి రూ.500 బోనస్ ఇచ్చామని గవర్నర్ తో చెప్పించారు. కానీ రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం సర్కారు రూ. 11,794 కోట్లు బాకీ పడింది అన్నారు.

రాష్ట్రంలోని రైతులు 260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించారని స్వయంగా గవర్నరే చెప్పారు. ఈ లెక్క ప్రకారం చూస్తే రూ. 13,000 కోట్లు రైతులకు చెల్లించాలి. కానీ ఇప్పటి వరకు బోనస్ రూపంలో రైతులకు 24 లక్షల మెట్రిక్ టన్నులకు గాను.. రూ.1206 కోట్లు ఇచ్చినట్టు కూడా స్వయంగా గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అంటే మొత్తం 13వేల కోట్ల రూపాయల్లో రైతులకు ఇంకా రూ. 11,794 కోట్ల రూపాయలు రేవంత్ సర్కారు బాకీ ఉన్నది. 9% వరికి ఇచ్చి 91% వరి ఎగనామం పెట్టింది రేవంత్ సర్కార్ అన్నారు.

సరే దొడ్డు రకాలకు ఎలాగూ ఎగనామం పెట్టారు. కనీసం సన్నాలకైనా ఇచ్చారా అంటే అదీ లేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో చెప్పిన దాని ప్రకారం రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా సన్నాలు పండాయి. కానీ ప్రభుత్వం బోనస్ ఇచ్చింది కేవలం 24 లక్షల మెట్రిక్ టన్నులకే. అంటే రైతులు పండించిన సన్నాల్లో కేవలం 28 శాతానికి మాత్రమే ప్రభుత్వం బోనస్ ఇచ్చింది. ఇంకా 72 శాతం మంది రైతులకు బోనస్ డబ్బులు రాలేదు. కానీ బయట ప్రచారాలు మాత్రం గట్టిగా చేసుకుంటోంది. పావలా పని చేసి వెయ్యి రూపాయల పబ్లిసిటీ చేసుకోవడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. ఎన్నికల సమయంలో అరచేతిలో స్వర్గం చూపించి ఇప్పుడు మోచేతికి బెల్లం పెట్టి నాకమంటుంది కాంగ్రెస్ పార్టీ…తెలంగాణ రైతులకు రేవంత్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అన్నారు.

Also Read:అబద్దాలనే అందమైన భాషలో చెప్పారు: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -