రేవంత్ సర్కారు తీరు ఆడలేక మద్దెలవోడు అన్నట్టుగా ఉంది. పాలన ఎలా చేయాలో తెలియదు. పరిపాలించడం చాతకాదు. తెలిసిన వాళ్లు ఇచ్చిన సలహాలు తీసుకునే మనస్తత్వం లేదు అని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత సతీష్ రెడ్డి. ఎంతసేపు గత ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ , హరీష్ రావు మీద ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు… చివరకు తమ తప్పులను, వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి దాడులకు సైతం తెగబడటం దుర్మామర్గమైన చర్య అని దుయ్యబట్టారు.
ఖమ్మంలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నాయకులపై దాడి చేయడం.. ఓ కార్యకర్త కాలు విరగ్గొట్టడం.. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలనకు నిదర్శనం. వరద బాధితులను ఆదుకోవడం తెలియదు. నీళ్లు లేక, అన్నం లేక ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు వెళ్లిన వారిపై దాడి చేసి తమ వైఫల్యాలను బయటకు రాకుండా చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. స్వయంగా మంత్రి కుమారుడే దాడిలో పాల్గొన్నాడంటే.. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే జరిగింది. మహబూబాబాద్ లో రేవంత్ రెడ్డి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఈ దాడి జరిగింది. అంటే ఖమ్మంకు వచ్చిన బీఆర్ఎస్ నేతలపై దాడికి కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఉసిగొల్పారనేది స్పష్టమౌతోంది. పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం, వాళ్లు ప్రేక్షకపాత్ర వహించడం… అన్నీ కూడా ప్రభుత్వ పెద్దల ప్రమేయాన్ని తేటతెల్లం చేస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే.. సాధారణ ప్రజల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డిపై ఖమ్మం ప్రజలు ఏ స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారో లైవ్ లోనే ప్రపంచమంతా చూసింది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకులపై దాడులకు తెగబడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తుంది. మీ లాగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలంటే.. మీ కంటే మా పార్టీ కేడర్ ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ నాయకులు అడుగు బయటపెట్టలేని పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా తన తీరు మార్చుకోవాలి. యూపీ, బీహార్ తరహా పాలనను తెలంగాణలో తీసుకొస్తాం. మాట్లాడిన వారిని, ప్రశ్నించిన వారిని అంతం చేస్తామంటే.. ప్రజలు చూస్తూ ఊరుకోరు. రాష్ట్ర సరిహద్దుల దాకా తరిమి కొడతారని హెచ్చరించారు.
Also Read:వరద నష్టంపై ఏపీ సర్కార్ రిపోర్టు రెడీ!