సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత రాకేశ్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేసేది పాదయాత్ర కాదు పాపపు యాత్ర, ప్రాయశ్చిత్త యాత్ర, పశ్చాత్తాప యాత్ర అని ఎద్దేవా చేశారు.
మూసీ పుట్టిన వికారాబాద్‌లో అడవులు ధ్వంసం చేసి.. మూసీ ప్రవహించే హైదరాబాద్‌లో ఇల్లు కూలగొట్టి వలిగొండలో పాదయాత్ర చేస్తావా అని రేవంత్ రెడ్డిపై ఏనుగుల రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. అయినా పాదయాత్ర చేయాల్సింది రైతుల కల్లాల కాడికి, ఛిద్రమైన మా పోచంపల్లి చేనేతల మగ్గాల కాడికి, నిత్యం ఆసుపత్రుల పాలవుతున్న మా గురుకుల విద్యార్థుల దగ్గరకు అని అన్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా ఉంటూ ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తానని రైతులకు హామీ ఇస్తూ.. ఏకంగా లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేశారని ఏనుగుల రాకేశ్ రెడ్డి గుర్తుచేశారు. రాజ్యాన్ని పాలించే రాజు ఒట్టేసే మాట తప్పితే ఆ ప్రభావం, దైవాగ్రహం ప్రజల మీద పడుతుందని చెప్పారు. అందుకే, తెలంగాణలో గత వర్షాకాలం వర్షాలు ఆలస్యంగా పడ్డాయని అన్నారు. ప్రజలు నిలదీస్తారని ఈ కథలు పడుతున్నావ్.. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు.
Also Read:KTR: మేఘా కంపెనీని బ్లాక్ లిస్ట్ చేసే దమ్ముందా?