రుణమాఫీపై ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవడంతో ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు రెండు లక్షల వరకు రుణమాఫీని అందరికీ వర్తింపజేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఎన్నికలు కాగానే రైతు రుణమాఫీ కోసం రూ. 40 వేల కోట్ల రూపాయలు అవసరమని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని.. కానీ కేబినెట్ మాత్రం కేవలం 31 వేల కోట్లకు మాత్రమే అనుమతిచ్చిందని అన్నారు.
22వ తేదీన అన్ని మండల కేంద్రాలు/నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్‌ఎస్ తరఫున ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు కేటీఆర్. ఎవరికీ తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలను అయోమయానికి, ఆవేదనకు గురిచేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కనీసం 40% మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదని, క్షేత్రస్థాయి నుంచి తమకు సమాచారం అందిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి కారణంగా లక్షలాది మంది రైతన్నలు రోజు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని వెంటనే చేయాలని, ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. డిసెంబర్ 9లోగా రుణమాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆగస్టు 15 అంటూ మరోసారి మాట తప్పారని మండిపడ్డారు.
Also Read:Rahul Gandhi:మీరే నా స్పూర్తి..రాజీవ్‌కు ఘన నివాళులు