మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగి, తుడిచే పనులకు తెలంగాణ మహిళలను ఉపయోగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్,సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ లు మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డల స్వాభిమానాన్ని అందాల పోటీదారుల పాదాల చెంత ఉంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సంస్కృతిని అవమానించారన్నారు. రేవంత్ రెడ్డి చేసిన పని ఆయన బానిస మనస్తత్వానికి నిదర్శనమన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అంతులేని దుఖాన్ని కలిగించిన ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియా గాంధీ కి మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్,సునీత లక్ష్మారెడ్డి,మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ లు లేఖ రాశారు.
దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమం, అసంఖ్యాక అమరవీరుల త్యాగాల గురించి అవగాహన ఉన్న సోనియా గాంధీ, తమ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పిచ్చి పనులను కంట్రోల్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆడపడుచులతో విదేశీ మహిళల కాళ్లు కడిగించిన కాంగ్రెస్ ప్రభుత్వ చర్య రాష్ట్ర ప్రజల మనసును తీవ్రంగా బాధించిందన్నారు. మహిళా సాధికారత పేరిట ఇలాంటి పనులను చేయించడం ప్రభుత్వ దిగజారుడు వైఖరికి నిదర్శనం అన్నారు. రేవంత్ రెడ్డి చర్యలు తెలంగాణ సంప్రదాయాలను అవమానించడమే కాక, ప్రపంచం ముందు ఈ నేల ఖ్యాతిని మంటగలిపాయని మహిళా నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేల స్వాభిమానానికి తెలంగాణ మహిళలు నిదర్శనమని,వయసుతో సంబంధం లేకుండా ఆడబిడ్డల కాళ్లు మొక్కడం ఈ నేల సంప్రదాయం అన్నారు. అలాంటి గడ్డ మీద తెలంగాణ ఆడబిడ్డలతో విదేశీ మహిళల కాళ్లు కడిగించడం అనేది తెలంగాణ సంప్రదాయం కాదు, రేవంత్ రెడ్డి వికృత వ్యక్తిత్వానికి సాక్ష్యం అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు తెలంగాణ స్ఫూర్తిని అర్థం చేసుకోలేని అజ్ఞానాన్ని, ఎవరినో సంతోషపెట్టడానికి ఈ నేల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే దాస్య మనస్తత్వాన్నే చూపిస్తున్నాయన్నారు.
రజాకార్ల, దొరల దౌర్జన్యం అయితేనేమి, సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో అనుభవించిన వివక్ష అయితేనేమి, అణిచివేత ఏ రూపంలో ఉన్నా ఈ నేల నిరంతరం ప్రతిఘటించిందన్నారు. తెలంగాణ ఉద్యమం కేవలం రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే కాదు, ఇది మా ఆత్మగౌరవాన్ని చాటడానికి , మా సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు మా తెలంగాణ బిడ్డల సాధికారత కోసం జరిగిన మహాపోరాటం అన్న మహిళా నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తనతో తెలంగాణ ప్రతిష్ట మసకబారుతుందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం గళమెత్తిన ఆశా వర్కర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం సాగించిన దుశ్శాసన పర్వాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోదని, తమసోదరి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రే స్వయంగా నిండు సభలో ఘోరంగా అవమానించడం, అంతేకాకుండా, బెటాలియన్ పోలీసుల భార్యలు తమ భర్తలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా సచివాలయం ముందు నిరసన తెలిపినప్పుడు, వారిపై కూడా అత్యంత కిరాతకంగా రాష్ట్రప్రభుత్వం వ్యవహరించిందని గుర్తు చేశారు. మహిళా జర్నలిస్టులను “బట్టలు ఊడదీసి కొడతాము” అని స్వయంగా రేవంత్ రెడ్డి బెదిరించడం ఆయన స్త్రీ వ్యతిరేక, నియంతృత్వ ధోరణులకు సాక్ష్యం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న వికృత సంస్కృతికి ప్రతిబింబాలని విమర్శించారు.
సీఎం సొంత నియోజకవర్గం లగచర్లలో దళిత గిరిజన ఆడబిడ్డలపై పోలీసులు అర్ధరాత్రి జరిపిన అకృత్యాలను సాటి మహిళలుగా తాము ఎన్నటికీ మరిచిపోలేమనీ,. ఆ బాధిత మహిళలకు న్యాయం దక్కాలన్న ఉద్దేశ్యంతో ఢిల్లీలోని మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్ వరకు వెళ్లి తాము పోరాడామని చెప్పారు. ఆ సంస్థలు తప్పుపట్టినా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంకా బుద్ధి రాలేదన్నారు. వస్తుందన్న నమ్మకం రాష్ట్రంలో ఎవరికీ కూడా లేదన్నారు.
గత 19 నెలలుగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి, రాష్ట్ర ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాలరాస్తూ, అడుగడుగునా తెలంగాణ స్వాభిమానాన్ని దిగజార్చే విధంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఎన్నికల సమయంలో మహిళల సంక్షేమం కోసం గ్యారెంటీల పేరిట అనేక వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ, మహాలక్ష్మి పథకం కింద నెలకు 2500 ప్రతి మహిళకు ఇస్తామని, ప్రతి చదువుకునే విద్యార్థికి స్కూటీ ఇస్తామని రకరకాల హామీలిచ్చి, ఏడాదిన్నర గడిచినా ఈ హామీలను అమలు చేయడం లేదన్నారు. ఈ వాగ్దానాలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారనీ ఆరోపించారు.
Also Read:హీరో బెల్లంకొండపై పోలీస్ కేసు
ఓవైపు తెలంగాణ దివాలా తీసిందని, ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయిందని, అప్పు కోసం వెళ్తే దొంగను చూసినట్టు చూస్తున్నారని తన చేతకానితనాన్ని బయటపెట్టుకున్న ముఖ్యమంత్రి మరోవైపు అందాల పోటీల కోసం ఏకంగా రూ.200 కోట్ల ఖర్చు చేయడం తెలంగాణ మహిళలను మాయమాటలతో మోసం చేయడమే అన్న సంగతి ప్రజలు తెలిసిందన్నారు. ఇలాంటి ఆర్భాటాల కోసం రూ. 200 కోట్లు వెచ్చించడం కంటే, ఆ మొత్తాన్ని మహిళల సంక్షేమం, విద్య, ఉపాధి కోసం ఉపయోగించి ఉంటే రాష్ట్ర ఆడబిడ్డలకు నిజమైన గౌరవం దక్కేది అన్నారు.తెలంగాణ ఏర్పడినప్పుడు “ఇది ఆత్మగౌరవానికి సంకేతంగా నిలవాలి” అని ఆకాంక్షించిన మీరు,ప్రతినిత్యం ఆడబిడ్డల ఆత్మాభిమానంతో ఆటలాడుతున్న ముఖ్యమంత్రిని ఇంకా వెనకేసుకోస్తారా అని ప్రశ్నించారు.అధికార దుర్వినియోగం, మహిళల పట్ల ఉన్న చులకన భావాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. తెలంగాణ తల్లులు, అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మహిళా నేతలు డిమాండ్ చేశారు.

