మోసపూరిత పాలనతో ప్రజలను నిలువునా ముంచుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కత్తి పెట్టి హింసిస్తూ ఇందిరమ్మ రాజ్యం అంటేనే అప్రకటిత ఎమర్జెన్సీ అని చాటుతున్నా రని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఫార్ములా ఈ కారు రేసింగ్ అక్రమ కేసులో మరోసారి ఏసీబీ విచారణకు పిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపుకు పరాకాష్ట అని ఆయన సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కారు అక్రమ పాలనను ఎండగడుతూ ప్రజల పక్షాన గళమెత్తుతున్న కేటీఆర్ పై ఇంత కక్ష సాధింపా? అని ఆయన ప్రశ్నించారు.
ఎలాంటి అక్రమాలు జరగని విశ్వ విఖ్యాత కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కుతూ తెలంగాణ సాధించిన కేసీఆర్ ను నిన్న,హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసం చేపట్టిన ఫార్ములా ఈ కారు రేసింగ్ లో ఏదో జరిగిందని ఆధారాలు లేని అభియోగాలతో నేడు కేటీఆర్ లను విచారణల పేరుతో వేధించడం తెలంగాణ ఆత్మగౌరవానికి మాయని మచ్చ అని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ‘మరో వంద అక్రమ కేసులు పెట్టుకో తలవంచం. అరెస్టుల మీద అరెస్టులు చేసుకో భయపడం.
కాళేశ్వరం పై విచారణ కాంగ్రెస్ కుట్ర. ఫార్ములా ఈ రేస్ ఒక బేఖారు కేసు.కేసీఆర్ ,కేటీఆర్ లు కడిగిన ముత్యం లా ప్రజాక్షేత్రంలో నిలుస్తారు అని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన కేటీఆర్ నిఖార్సయిన ఉద్యమకారుడన్నారు. తెలంగాణ స్వేచ్చ కోసం కదం తొక్కిన పోరు బిడ్డ అని ఆయన పేర్కొన్నారు.
ప్రజాక్షేత్రంలో కేటీఆర్ ను మిస్టర్ క్లీన్ గా ఆయన అభివర్ణించారు. కేటీఆర్ ఫార్ములా ఈ కారు రేసింగ్ ఈవెంట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయికి చేర్చడానికి ప్రయత్నం చేశారే తప్ప సీఎం రేవంత్ రెడ్డి మాదిరిగా తన సోదరులకు, బావమరుదులకు దోచిపెట్టడానికి కాదని ఆయన అన్నారు. రేవంత్ లాగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి పట్టుబడిన నేర చరిత్ర కేటీఆర్ కు లేదన్నారు. కేటీఆర్ అరపైసా అవినీతికి పాల్పడలేదని జీవన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పై ఏదో రకంగా బురదజల్లి తాత్కాలిక ప్రయోజనం పొందాలని చూస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటామని, సర్కార్ దాష్టీకాలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కుట్రల నుంచి కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. నిఖార్సయిన ఉద్యమకారులను హింస పెడుతున్న కాంగ్రెస్ చివరకు ధ్వంసం కాక తప్పదని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
Also Read:తప్పు చేయలేదు..తెలంగాణ ప్రతిష్ట పెంచా:కేటీఆర్

