ఛార్లెస్ ఫిలిప్ ఆర్ధర్ జార్జ్( ఛార్లెస్-3)ని బ్రిటన్ రాజుగా అధికారికంగా ప్రకటించారు. సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో కౌన్సిల్ సమక్షాన ఆయనకు రాజరికపు అధికారాలు కట్టబెట్టారు. ఈ రాజరిక అధికారాల అప్పగింత కార్యక్రమం మొదటి సారి టీవీలో ప్రసారం జరిగింది.
ఛార్లెస్-3ను రాజుగా ప్రకటించిన తర్వాత ఆయన సదరు డాక్యుమెంట్‌పై సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 200మంది హాజరయ్యారు. డాక్యుమెంట్లపై సంతకం చేయడానికి ముందు రూమ్‌లో అందరూ గాడ్ సేవ్ ది కింగ్ అని నినాదం చేశారు. కాగా ఇప్పటివరకూ ఉన్న అన్ని అధికారిక హోదాలో ఉన్న ఎలిజబెత్-2 స్థానంలోకి ఆయన కుమారుడు ఛార్లెస్ వచ్చారు. పాస్ పోర్ట్, నాణేలు, కరేన్సీ, బంకింగ్ హోమ్ ప్యాలెస్‌లోని గార్డ్స్ యొక్క అధికారక చిహ్నలు, కామన్వెల్త్ దేశాల అధిపతిగా, ఒకప్పటి బ్రిటన్ పాలిత దేశాల్లోని 16 దేశాలకు రాజుగా వ్యవహరించనున్నారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో అధికారికంగా రాజుగా బాధ్యతలు స్వీకరించారు. రాణి అస్తమయంతో ప్రిన్స్ ఛార్లెస్ ఫిలిప్ ఆర్ధర్ జార్జ్ ఇప్పుడు కొత్త రాజు అయ్యారు అని కౌన్సిల్ ప్రకటించింది. ఈ సమయంలో ఆయన వెంట క్వీన్ కాన్సార్ట్ కెమిల్లా, ఆయన కుమారుడు విలియం ఉన్నారు. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‌తో పాటు ఆరు మంది మాజీ ప్రధానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజుగా ప్రమాణం చేసిన కింగ్ ఛార్లెస్ తన తల్లి మరణవార్తపై ప్రకటన చేశారు. జీవిత కాలం ప్రేమను పంచాలని, నిస్వార్థ సేవ చేయాలని తన తల్లి తనకు నేర్పినట్లు ఛార్లెస్ తెలిపారు. తన తల్లి రాజ్యాన్ని ఏలిన సమయం, ఆమె అంకిత భావం, ఆమె భక్తి అసాధారణమైనవని అన్నారు. ఇది విషాదకర సమయమే అయినా, ఆమె విశ్వసనీయమైన జీవితానికి థ్యాంక్స్ చెబుతున్నట్లు కింగ్ ఛార్లెస్ తెలిపారు.