సముద్రానికి – కృష్ణానది సంగమానికి నిలయమైన హంసలదీవి ప్రాంతం జిల్లాలోని చుట్టుప్రక్కన ప్రాంతాల వారికే ఎక్కువగా పరిచయం. కానీ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన “జయ జానకి నాయక” సినిమా విడుదలైన తర్వాత… ‘హంసలదీవి ఇంత అందంగా ఉంటుందా’ అనిపించేలా చూపించారు. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకోకపోవడంతో, హంసలదీవిని సినిమాలో చూసిన వారందరికీ చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది.
అయితే అసలు విషయం ఏంటంటే.. బోయపాటికి ఈ లొకేషన్ గురించి తెలియనే తెలియదట. అలాంటి బీచ్ ఒడ్డున ఒక ఫైట్ తీయాలి.. లేదంటే గంగానది ఒడ్డున కాశీలో తీయాలి అనుకుంటే.. మనోడు బ్యాంకాక్ నుండి గోవా వరకు.. కాశి నుండి ఇతర ప్రదేశాల వరకు.. చాలాచోట్ల రెక్కీ చేశాడట. చివరకు కృష్ణా జిల్లా కోడూరు మండలంలో కృష్ణమ్మ పరవళ్లను చూడ్డానికి వెళ్ళి.. ఆ ప్రాంత అందాలను చూసి మరుక్షణం అక్కడే షూటింగ్ చేయాలని ఫిక్సయ్యాడట. దానితో ఏకంగా 13 రోజుల పాటు 4 కోట్లు ఖర్చుపెట్టి ఆ ఎపిసోడ్ ను రూపొందించాడని చెప్పాడు బోయపాటి.
ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు శ్లోకం ద్వారా ప్రారంభమైన విజువల్స్ లో… తొలుత నదీ సంగమ ప్రాంతాన్ని బోయపాటి అద్భుతంగా చూపించారు. బహుశా డ్రోన్ కెమెరాతో దీన్ని షూట్ చేసారో ఏమో గానీ, ఆ విజువల్స్ లోనే అద్భుతమైన ఫైట్ ను చిత్రీకరించారు. సెకండాఫ్ లో హైలైట్స్ గా నిలిచిన సన్నివేశాలలో ప్రధానంగా నిలిచిన ఈ ఫైట్ లో రౌడీ తలకాయ నరికివేసే సన్నివేశం ఉండడం విశేషం.