దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో కొత్త సినిమాలో రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో బాలకృష్ణ అఘోరాగా కనపడనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో బాలయ్య ద్విపాత్రిభినయంలో నటించబోతున్నారని.. అందులో ఒకటి అఘోరా అని వార్తలు వస్తున్నాయి. ఇక అఘోరా పాత్ర కోసం బాలయ్య గుండు కొట్టించుకోవడంతో పాటు 15 కేజీల బరువు తగ్గినట్లు టాలీవుడ్లో టాక్. ఈ పుకార్లన్నింటిపై తాజాగా దర్శకుడు బోయపాటి స్పందించారు.
ఆ వార్తలు నిజమేనని, తన తదుపరి సినిమాలో బాలయ్య అఘోరా పాత్రలో కనిపించనున్నారని ప్రకటించారు. ఈ కొత్త సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కరోనా విజృంభణతో లాక్డౌన్ విధించడంతో సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. దీంతో బాలయ్య, బోయపాటి సినిమా షూటింగ్కు కూడా విరామం వచ్చింది. బాలయ్య అభిమానులకు మరోసారి మంచి సినిమాని అందిస్తానని బోయపాటి వ్యాఖ్యానించారు.