కంటైన్‌మెంట్ నిబంధ‌న‌ల‌ను పాటించాలి – మేయ‌ర్

343
bonthu rammohan
- Advertisement -

నాగోల్‌, ఎల్బీన‌గ‌ర్ చౌర‌స్తా, సాగ‌ర్ రింగ్ రోడ్ ల వ‌ద్ద చేప‌ట్టిన ఎస్‌.ఆర్‌.డి.పి ఫ్లైఓవ‌ర్స్, రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన ఆస్తుల సేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేసిన‌ట్లు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ పేర్కొన్నారు. శ‌నివారం ఆయా ప్రాంతాల్లో సేక‌రించిన ఆస్తుల కూల్చివేత ప‌నుల‌ను ప‌రిశీలించారు. పంజాగుట్ట ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నుల‌ను కూడా ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… ఎస్‌.ఆర్‌.డి.పి ప‌నుల‌కు నిధుల కొర‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు. లాక్‌డౌన్ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకొని ఎస్‌.ఆర్‌.డి.పి ప‌నుల‌ను వేగ‌వంతం చేసిన‌ట్లు తెలిపారు. ఆస్తులు కోల్పోయిన‌వారికి ముంద‌స్తుగానే భూసేక‌ర‌ణ సొమ్ము చెల్లిస్తున్న‌ట్లు తెలిపారు. న‌గ‌రం న‌లువైపులా ఎస్‌.ఆర్‌.డి.పి, సి.ఆర్‌.ఎం.పి ప‌నులు పూర్తిచేసేందుకు త‌గు ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌తో సామాజిక దూరాన్ని అమ‌లు చేస్తూ కార్మికులు, ఇత‌ర‌ నిపుణులు, యంత్రాలు, మెటీరియ‌ల్‌ను ఎక్కువ‌గా స‌మీక‌రించిన‌ట్లు తెలిపారు.

రేయింబ‌వ‌ల్లు ప‌నులు కొన‌సాగుతున్న‌ట్లు తెలిపారు. విజ‌య‌వాడ నుండి కొత్త‌పేట వైపు ఉన్న ర‌హ‌దారిలో ఎల్బీన‌గ‌ర్ చౌర‌స్తా పై నుండి నిర్మించే రెండో ఫ్లైఓర్ నిర్మాణం, రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన దేవాల‌య శాఖకు చెందిన 18 మ‌డిగెల‌ను సేక‌రించిన‌ట్లు తెలిపారు. షాపులు కోల్పోయేవారికి ప్ర‌త్యామ్న‌య ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. అలాగే స్వ‌ల్పంగా కోల్పోయిన మ‌డిగెల స్థానంలో నిర్మించే వాణిజ్య స‌ముదాయంలో గ‌దుల కేటాయింపులో వీరికి ప్రాధాన్య‌త ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. సుదీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌కు ఉన్న ఆటంకాలు తొల‌గిపోయిన‌ట్లు పేర్కొన్నారు. మైస‌మ్మ గ‌ర్భ‌గుడికి ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌కుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని రోడ్డు విస్త‌ర‌ణ చేస్తున్న‌ట్లు తెలిపారు. మ‌డిగెల తొల‌గింపులో స‌హ‌క‌రించిన మూసి రివ‌ర్ ఫ్రంట్ అథార‌టి ఛైర్మ‌న్‌, ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి, దేవ‌దాయ శాఖ అధికారుల‌కు, చిరువ్యాపార‌స్తుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

కంటైన్‌మెంట్ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని ప్ర‌జ‌ల‌కు జిహెచ్‌ఎంసి మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు. శ‌నివారం ఎల్బీన‌గ‌ర్ జోన్‌లోని ఆర్కేపురంలో ఏర్పాటుచేసిన కంటైన్‌మెంట్ ప్రాంతంలో ప‌ర్య‌టించారు. కోవిడ్‌-19 వ్యాప్తిని పూర్తిగా అరిక‌ట్టుట‌కై ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను గుర్తించి అందుబాటులో ఉంచేందుకు జిహెచ్‌ఎంసి నోడ‌ల్ ఆఫీస‌ర్లు అందుబాటులో ఉన్నార‌ని తెలిపారు. మొబైల్ రైతు బ‌జార్ల ద్వారా కూర‌గాయ‌ల‌ను అందించ‌నున్న‌ట్లు తెలిపారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో జిహెచ్‌ఎంసి హెల్ప్ లైన్ నెంబ‌ర్ 040-2111 11 11 కు లేదా నోడ‌ల్ ఆఫీస‌ర్ కు ఫోన్ చేయాల‌ని సూచించారు. కంటైన్‌మెంట్‌ప‌రిధిలో ఉన్న ఇళ్ల నుండి ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని తెలిపారు. కొద్ది రోజుల పాటు ప్ర‌భుత్వానికి పూర్తిగా స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కొర‌కే ప్ర‌భుత్వం అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. రోడ్ల‌పై ఉమ్మివేసినా, మాస్కులు ధ‌రించ‌క‌పోయినా క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అవుతాయ‌ని హెచ్చ‌రించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎల్బీన‌గ‌ర్‌ జోన‌ల్ క‌మిష‌న‌ర్ ఉపేంద‌ర్‌రెడ్డి, కార్పొరేట‌ర్లు రాధ‌, చెరుకు సంగీత‌ప్ర‌శాంత్‌గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -