బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికిగాను భూ, ఆస్తుల సేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరితగతిన పూర్తిచేసి పనులను చేపట్టేందుకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ స్వయంగా రంగంలోకి దిగారు. రూ. 387 కోట్ల వ్యయంతో బాలానగర్ క్రాస్ రోడ్ నుండి నర్సాపూర్ క్రాస్ రోడ్ వరకు ఈ ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణానికి 367 ఆస్తులను సేకరించాల్సి ఉంది. ఈ ఆస్తుల సేకరణలో మరింత జాప్యాన్ని నివారించేందుకుగాను నగర మేయర్ బొంతు రామ్మోహన్ నేడు జిహెచ్ఎంసి కార్యాలయంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్లు, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ మమత, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి, టౌన్‌ప్లానింగ్, భూసేకరణ అధికారులు, ఆస్తులు కోల్పోనున్న యజమానులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలానగర్ ఫ్లైఓవర్ ఆస్తుల సేకరణ విషయంలో యజమానుల మధ్య ఏర్పడ్డ స్వల్ప వివాదాలు, న్యాయపరమైన కేసుల విషయంలో మేయర్ రామ్మోహన్ ఆయా ఆస్తుల యజమానులు, కేసులు నమోదు చేసుకున్నవారితో నేరుగా మాట్లాడడంతో పలు వివాదాలు వెంటనే పరిష్కారం జరిగి నిబంధనలను అనుసరించి ఆస్తులను జిహెచ్ఎంసికి అప్పగించడంలో పలువురు తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు. ఈ బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణం సందర్భంగా కోల్పోనున్న మొత్తం 367 ఆస్తులకుగాను ఇప్పటికే 120 ఆస్తులకు సంబందించి ఆమోదం లభించిందని, మరో 76 ఆస్తులు ప్రభుత్వ విభాగాలకు సంబంధించినవి ఉన్నాయని పేర్కొన్నారు. మిగిలిన 170 ఆస్తులకు సంబంధించి భూసేకరణ చట్టం కింద డిక్లరేషన్ దాఖలు చేయడం జరిగిందని మేయర్ రామ్మోహన్ వివరించారు.
బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 387 కోట్ల రూపాయలు కేటాయించగా దీనిలో రూ. 265 కోట్లు భూసేకరణ, ఆస్తుల సేకరణకు కేటాయించడం జరిగిందని, రూ. 122 కోట్లు ఫ్లైఓవర్ నిర్మాణానికి అవుతుందని తెలిపారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో సికింద్రాబాద్, కూకట్‌పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, గాజుల రామారం, సుచిత్ర తదితర మార్గాల్లో సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. కాగా గత కొద్ది నెలలుగా ఆస్తుల సేకరణలో సంబంధిత యజమానుల మధ్య ఏర్పడ్డ వివాదాలు, కోర్టు కేసులను పరిష్కరించడంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఇరు వర్గాలతో సమావేశమై అక్కడికక్కడే పరిష్కార మార్గాలను చూపించడంతో బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.