దేశం మొత్తాన్ని కుదిపేసిన శ్రీదేవి మరణం గురించి ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తను ఎలా చనిపోయింది అనే దాని గురించి ప్రాధమిక సమాచారం ఉన్నప్పటికీ దాన్ని అధిక శాతం అభిమానులు నమ్మడం లేదు. జరిగింది దుబాయ్ లో కనక మీడియా సైతం పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టడంలో విఫలమైంది. ఈ నేపధ్యంలో అసలు ఆ రాత్రి ఏం జరిగింది అనే దాని గురించి ఒక్క బోనీ కపూర్ కు మాత్రమే తెలుసన్నది నిజం. ప్రముఖ ఫిలిం అనలిస్ట్ కోమల్ నెహతాతో అప్పటి సంఘటన గురించి బోనీ పర్సనల్ గా షేర్ చేసుకున్నాడు.
‘దుబాయ్‌కి ప్లాన్ చేసుకుని వెళ్లాలనుకోలేదు. మోహిత్ పెళ్లయ్యాక జాన్వి(పెద్ద కూతురు)కు దుస్తులు కొనడానికి శ్రీదేవి కొన్ని రోజులు దుబాయ్‌లోనే ఉంటానంది. దాంతో నాకు లఖ్‌నవూలో పనుండి ఇండియా వచ్చేశాను. ఫిబ్రవరి 24న ఉదయం శ్రీదేవి నాకు ఫోన్ చేసింది. నన్ను చాలా మిస్సవుతున్నానని చెప్పింది. అదే రోజు సాయంత్రం నేను దుబాయ్ వస్తున్నట్లు శ్రీదేవికి చెప్పలేదు. అయితే శ్రీదేవికి ఒంటరిగా ఉండే అలవాటు లేదు. అందుకే ‘తొందరగా దుబాయ్‌కి బయలుదేరు డాడీ’ అని జాన్వి నాకు చెప్పింది.’
‘ఫిబ్రవరి 24న సాయంత్రం 6.20 గంటల సమయంలో దుబాయ్ చేరుకున్నాను. అయితే శ్రీదేవికి సర్‌ప్రైజ్ ఇద్దామనుకుని నా లగేజీని కాస్త లేటుగా గదిలో పెట్టమని బెల్‌బాయ్‌కి చెప్పాను. నా వద్ద ఉన్న డూప్లికేట్ తాళం చెవితో గది తలుపు తీశాను. శ్రీదేవి నన్ను చూసిన సంతోషంతో ఆలింగనం చేసుకుంది. నేను దుబాయ్‌కి వచ్చి తనను సర్‌ప్రైజ్ చేస్తానని ముందే ఊహించానని శ్రీదేవి చెప్పింది. అరగంట పాటు ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం.’
‘ఆ తర్వాత ఇద్దరం కలిసి డిన్నర్‌కి వెళ్లాలనుకున్నాం. శ్రీదేవి స్నానం చేసి వస్తానంది. నేను హోటల్‌లోని లివింగ్ రూంలో ఉంటానని చెప్పాను. తను వచ్చేవరకు టీవీ చూస్తూ కూర్చున్నాను. కానీ ఎంతసేపటికీ గది నుంచి బయటికి రాలేదు. ఏం జరిగిందో చూద్దామని గదిలోకి వెళ్లాను. తను ఇంకా బాత్రూమ్ నుంచి బయటకు రాలేదు. పలుమార్లు తలుపు కొట్టి చూశాను. స్పందన లేదు. బాత్రూమ్ తలుపు గడియ పెట్టలేదు. దాంతో లోపలికి వెళ్లాను. తీరా చూస్తే నీరు నిండా ఉన్న బాత్‌టబ్‌లో మునిగిపోయి ఉంది. అది చూసి ఒక్క క్షణం నా గుండె ఆగిపోయింది.’ అని బోనీ నహతాకు వివరించారట.