విమానాలకు వరుసగా బెదిరింపు మెయిల్స్ రావడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో తాజాగా బ్రిటిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక అంతర్జాతీయ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. లండన్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు మెయిల్ అందిన వెంటనే సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు.
భద్రతా కారణాల దృష్ట్యా పైలట్ వెంటనే విమానాన్ని శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ చేశాడు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్‌పోర్ట్ భద్రతా బలగాలు, బాంబ్ స్క్వాడ్, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. విమానంలో ఉన్న 200 మందికిపైగా ప్రయాణికులను జాగ్రత్తగా కిందకు దింపి ప్రత్యేక భద్రతా తనిఖీలు చేపట్టారు.
ప్రయాణికులందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించి, వారి లగేజీతో పాటు విమానం మొత్తాన్ని బాంబ్ స్క్వాడ్ సిబ్బంది క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో కొంతసేపు విమానాశ్రయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, ప్రయాణికుల్లో ఆందోళన కనిపించింది. బెదిరింపు మెయిల్ వెనుక ఎవరు ఉన్నారు, అది నకిలీదా లేక నిజమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. వరుసగా వస్తున్న ఇలాంటి బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రతా అధికారులు స్పష్టం చేశారు.
Also Read:రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీస్తారా?

