శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

7
- Advertisement -

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అలర్ట్ పరిస్థితులు నెలకొన్నాయి. మూడు వేర్వేరు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కేరళలోని కన్నుర్ నుండి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం, ఫ్రాంక్‌ఫర్ట్–హైదరాబాద్ లుఫ్తాన్సా విమానం, అలాగే లండన్–హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానానికి గుర్తు తెలియని దుండగులు వరుసగా బెదిరింపు ఇమెయిల్స్ పంపినట్లు సమాచారం.

మెయిల్ అందిన వెంటనే ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ, CISF, RGIA అధికారులు అత్యవసర ప్రోటోకాల్‌ను అమలు చేశారు. మూడు విమానాలను ప్రత్యేకంగా ఐసోలేషన్ బేలకు మళ్లించి, అందులోని ప్రయాణికులను పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రతి విమానం లోపల, సామాను విభాగాల్లో, అలాగే కేబిన్ ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ బృందాలు సమగ్ర తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

సమీప ప్రాంతాల్లో అదనపు భద్రత ఏర్పాటు చేయడంతో పాటు, ఏవైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా అని డాగ్ స్క్వాడ్‌తో కూడిన బృందాలు పరిశీలిస్తున్నాయి. ప్రయాణికులను ఒక్కొక్కరిని ప్రశ్నించడంతో పాటు, వారి లగేజ్‌ను కూడా రీ–స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్స్ వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది.అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నప్పటికీ, అధికారులు పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నామని, పరిస్థితి నియంత్రణలో ఉందని తెలిపారు.

Also read:TG:హైదరాబాద్‌లో ట్రంప్ ఎవెన్యూ

- Advertisement -