శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కేఎల్ఎం–873 (KLM-873) విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తి ఈమెయిల్ పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సమాచారంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, విమానాన్ని ముందస్తు భద్రతా చర్యల మధ్య శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయించారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్‌లోని అత్యవసర భద్రతా ప్రోటోకాల్‌ను అమలు చేసి, సంబంధిత ప్రాంతాన్ని పూర్తిగా సీల్ చేశారు.
ఈ ఘటనతో కొద్దిసేపు విమానాశ్రయంలో ఉత్కంఠ వాతావరణం నెలకొనగా, ఇతర విమానాల రాకపోకలను కూడా అధికారులు అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని తెలుస్తోంది. అయితే పూర్తి తనిఖీలు ముగిసిన తర్వాతే స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.
బాంబు బెదిరింపు మెయిల్ ఎవరు పంపారనే దానిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సైబర్ విభాగం సహకారంతో ఈమెయిల్ మూలాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని, అన్ని భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని విమానాశ్రయ అధికారులు భరోసా ఇచ్చారు.
Also Read:కోడిగుడ్లతో క్యాన్సర్ ప్రమాదం లేదు!

