బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న మంచి నటుడు ఇర్ఫాన్ ఖాన్. ఇటీవల హిందీ మీడియం స్కూల్ టీచర్ల కోసం ఏర్పాటు చేసిన ఓ సినిమా ప్రదర్శన సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ… ‘‘బాహుబలి వంటి దక్షిణాది సినిమాలు భారత దేశంలోని మొత్తం మార్కెట్‌ను గుప్పెట్లోకి తెచ్చుకునేలా పుంజుకుంటున్నాయి. కాబట్టి హిందీ సినిమాలు మరింత మంచి సబ్జెక్టులతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించాడు.
హిందీ సినిమా మారాల్సిన సమయం వచ్చిందని ఇర్ఫాన్ ఖాన్ పేర్కొన్నాడు. హిందీ సినిమా వ్యాపారాన్ని హాలీవుడ్ సినిమాలు తమ వైపు మళ్లించుకుంటున్న తరుణంలో… బాలీవుడ్ తన ప్రమాణాలను మార్చుకోవాలని సూచించాడు. మరోవైపు ప్రాంతీయ సినిమాలు సైతం రోజు రోజుకూ మెరుగవుతున్న విషయాన్ని మర్చిపోరాదన్నాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ విజువల్ వండర్ బాహుబలి సినిమానూ ఉదహరించాడు.
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘బాహుబలి 2’ ఇంకా అదే ఊపును కొనసాగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో స్థానిక చిత్రాల రికార్డులను సైతం తిరగరాస్తూ దూసుకుపోతోంది. 10 రోజుల్లోపే 1000 కోట్ల గ్రాస్ ను సాధించి, అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం దేశ విదేశాల్లో సందడి చేస్తోన్న ‘బాహుబలి 2’ మొత్తమ్మీద 1500 కోట్లకు దగ్గరగా ఉంటుందని అంచనా. ఆయా ప్రాంతాల్లో కొత్త సినిమాలు విడుదలవుతున్నా, ‘బాహుబలి 2’ వసూళ్లపై ఎలాంటి ప్రభావం పడకపోవడం విశేషం.