సీజనల్ గా దొరికే కూరగాయలలో బోడ కాకరకాయలు ముందు వరుసలో ఉంటాయి. వర్షాకాలంలో మాత్రమే దొరికే వీటిని తినడానికి చాలమంది ఇష్టపడుతూ ఉంటారు. సాధారణ కాకరకాయలతో పోల్చితే సైజ్ లో చాలా చిన్నగా ఉండే ఈ బోడ కాకరకాయలు అటవీ ప్రాంతంలో అధికంగా లభిస్తూ ఉంటాయి. కేవలం వర్షాకాలంలో మాత్రమే ఇవి దొరకడం వల్ల మార్కెట్ లోకి వచ్చినప్పుడు భోజన ప్రియులు వీటిని అసలు వదలరు. ఈ బోడ కాకరకాయలతో వేపుడు, పచ్చడి, పులుసు వంటి వంటకాలు చేస్తుంటారు. అయితే వీటిని తినడం వల్ల కలిగే లాభాల గురించి మాత్రం చాలమందికి తెలియదు. వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ బోడ కాకరకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు ఉన్నాయి..
ఇందులో ఫోలెట్స్ అధిక శాతం ఉంటుంది. అందువల్ల వర్షాకాలంలో వేధించే జలుబు దగ్గు వంటి సమస్యలు ఎదుర్కోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. బోడ కాకరకాయలో విటమిన్ బి1, బి2, బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో పీచు పదార్థం మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. అందువల్ల శరీరానికి కావలసిన అన్నీ రకాల పోషకాలు పుష్కలంగా అందుతాయి. అలాగే ఇందులో పోషకాలతో పాటు ఔషధగుణాలు కూడా ఎక్కువే. అందుకే బోడ కాకరకాయలను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు.
Also Read:ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్
వీటిని తినడం వల్ల ధీర్ఘకాలిక వ్యాధులు అదుపులో ఉంటాయి ముఖ్యంగా బీపీ, షుగర్ వంటివి కంట్రోల్ లోకి వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే బోడ కాకరకాయలు తరచూ తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు కూడా కరుగుతాయట. ఇంకా పక్షవాతం, కంటి సమస్యలు, వివిధ రకాల చర్మసమస్యలను దూరం చేయడంలో కూడా బోడ కాకరకాయలు సమర్థవంతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు వీటిని తినడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు దోహద పడతాయట. కాబట్టి ఈ వర్షాకాలంలో మాత్రమే దొరికే బోడ కాకరకాయలను ప్రతిఒక్కరు తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు.