నల్లధనం లేని దేశంగా మార్చాలని కేంద్రం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ తెలిపారు. నోట్ల రద్దు నేపథ్యంలో తాను ఢిల్లీకి వెళ్లి ప్రధానితో గంటకుపైగా చర్చించానని సీఎం వెల్లడించారు. ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో నగదురహిత లావాదేవీలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సీఎం తెలిపారు.
మంత్రి వర్గ సమావేశం అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రధానితో సమావేశమైనపుడు నా అనుభవాలు, అవగాహనను పంచుకున్నా. ప్రధాని కూడా నా అభిప్రాయాలతో ఏకీభవించారు. ప్రధాని హైదరాబాద్ వచ్చినపుడు కూడా కొన్ని సూచనలు చేశానని తెలిపారు. ప్రజల సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలను ప్రధానితో చర్చించానన్నారు. నల్లధనం, లంచాలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకో అవగాహన ఉంది. నల్లధనం ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఎన్ని రూపాల్లో ఉన్న మట్టుబెట్టొచ్చని తెలిపారు.
రూ.500లోపు లావాదేవీలు నగదుతో జరిగేలా చూస్తాం. రూ.500కు పైబడిన లావాదేవీలు నగదు రహితంగా జరిగేలా చూస్తాం. రూ.100, రూ.500 నోట్లు సాధ్యమైనంత ఎక్కువగా పంపాలని కేంద్రాన్ని కోరా. నల్లధనం లేని..అవినీతి రహిత దేశంగా మార్చేందుకు రాష్ట్రం మద్దతుంటుందని కేంద్రానికి తెలిపా. ఉద్యోగుల జీతాలు నగదు రూపంలో చెల్లించే విషయమై బ్యాంకర్లతో మాట్లాడుతాం. ఆసరా చెల్లింపుల విషయంలో ఇబ్బందులు లేవు. నగదు రహిత లావాదేవీల నిర్వహణను సిద్దిపేట నియోజకవర్గం నుంచి అమలు చేస్తాం.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో అన్ని రాష్ట్రాల ఆదాయం తగ్గుతుంది. నల్లధనాన్ని పెంచి పోషించి దేశాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. దేశంలో పన్ను కట్టేవాళ్లు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నారు. ఆదాయ పన్ను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరా. భవిష్యత్తులో జీఎస్టీ, బీటీటీ మాత్రమే ఉంటాయన్నారు.
నగదు రహిత లావాదేవీల కోసం త్వరలో ఐటీ శాఖ ఆధ్వర్యంలో టీఎస్ వ్యాలెట్ ప్రవేశపెడతామని సీఎం అన్నారు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి ఎం వ్యాలెట్లపై విధించే ఎండీఆర్ ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం చెప్పారు. నగదు రహిత లావాదేవీలకు దేశవ్యాప్తంగా 14.5 లక్షల స్వైపింగ్ యంత్రాలున్నాయి. రాష్ట్రంలో 85వేల నుంచి లక్ష స్వైపింగ్ యంత్రాలున్నాయి. దేశ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీల కోసం 10కోట్ల స్వైపింగ్ యంత్రాలు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం మనుగడ సాధించాలంటే మీడియా సహకారం కావాలి. ఎంత తొందరగా బ్యాంకు ద్వారా జరిగే లావాదేవీలు పెరిగితే రాష్ట్రానికి అంత మేలు జరుగుతుంది. త్వరలో కలెక్టర్ల భేటీ నిర్వహించి జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు.