రూ.500, వెయ్యి నోట్ల రద్దుతో నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కోట్లకు కోట్లు ఇనపపెట్టెల్లో మూలుగుతున్న కట్టలను బయటకు తీశారు. బ్యాంకుల్లో మార్చుకోవటానికి ఐడీ ప్రూఫ్స్ కూడా చూపించాల్సి ఉండటం.. కొత్తగా ఎందుకీ తలనొప్పులు అనుకుంటున్నారు మరికొందరు. వీటిని మార్చుకోవటంపై ఆందోళన చెందుతున్న కొందరు ఆ డబ్బును అనుచరులు, ఆప్తులకు పంచుతున్నారనే వార్తలు వస్తున్నాయి.
కర్నాటక రాష్ట్రం కోలార్ లో ఓ పొలిటికల్ లీడర్ తన దగ్గర ఉన్న నల్లదనానికి అనుచరులకు పంచేశాడు. ఒక్కొక్కరికీ మూడు లక్షల రూపాయల చొప్పున కట్టలు కట్టి మరీ ఇచ్చారు. కోలార్ జిల్లాలోని బంగారుపేటలో ఈ ఘటన జరిగినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు, వార్త హల్ చల్ చేస్తోంది. ఎన్నే ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ కాంట్రాక్ట్ వర్క్ లు చేస్తున్నారంట. ఓ వేదిక ఏర్పాటు చేసి.. డబ్బు కట్టలను స్టేజ్ పై పెట్టి.. పూజ చేసి అందరికీ పంపిణీ చేయటం విశేషం. కొందరు మాత్రం ఇది ఓ బ్యాంక్ రైతులకు పంపిణీ చేసే రుణాలు అని కూడా అంటున్నారు.
మరోవైపు ఇంకొందరు మాత్రం కరెన్సీ నోట్లు తగులబెట్టారు. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో నోట్ల రద్దుతో భారీ ఎత్తున నల్ల ధనం బయటకి వచ్చి బుగ్గిపాలు అయింది. యూపీలోని బారెల్లీ లో ఓ కంపెనీకి చెందిన కొందరు వర్కర్లు.. బస్తాలతో 500 రూపాయలు, 1000 రూపాయల నోట్ల కట్టలను తీసుకొచ్చి.. ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతంలో నిప్పుపెట్టారు. నిప్పు పెట్టి అవి కాలీ కాలకుండానే అక్కడి నుండి పరార్ అయ్యారు.
దీనితో దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కాలిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుని ఆర్బీఐ అధికారులకు సమాచారం అందించారు. ఈ నోట్ల బస్తాలు.. వర్కర్లు తెచ్చిన కంపెనీకి చెందినవా? లేక రాజకీయ నాయకులకు చెందినవా? అనేది ఆరా తీస్తున్నారు.