దేశంలో నల్లధనాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రధాని అనూహ్యంగా పెద్దనోట్ల చెలామణిని రద్దుచేస్తున్నట్టు మంగళవారం రాత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆకస్మిక ప్రకటనపై ఒక వైపు ప్రశంసలు వెల్లువ కురుస్తుండగా, మరోవైపు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులు, టోల్ ప్లాజాలు, ఏటీఎం సెంటర్లతో సహా పలు కొనుగోలుకేంద్రాల వద్ద ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ కామర్స్ సంస్థలు ప్రభుత్వం చర్యలకు అనుగుణంగా తమ వ్యాపారంలోమార్పులు ప్రకటించాయి. పెద్ద కరెన్సీ నోట్లను రద్దుచేయడంతో తాజా ఆర్డర్లపై క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) సర్వీసులను ఈ రెండు రోజులు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాయి. రూ.2000 వేలకు పైన ఉత్పత్తులపై క్యాష్ ఆన్ డెలీవరీ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిందని జాతీయ మీడియా రిపోర్టు చేసింది. అలాగే ఫ్లిప్కార్ట్ ప్రస్తుతం క్యాష్ ఆన్ డెలివరీ సేవలను అనుమతించడం లేదని బ్లూం బర్గ్ నివేదించింది. వెయ్యి రూపాయలకు పైన విక్రయాలపై సీఓడీ ఆప్షన్ ను నిలిపివేసినట్టు ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి తెలిపారు. అమెజాన్ కూడా సీవోడి ఆప్లన్ డిసేబుల్ చేసింది. కొన్ని ఫూడ్ డెలివరీ సంస్థలు కూడా ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి.
పెద్ద నోట్ల రద్దు దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీపై ప్రభావం చూపుతోంది. సాధారణంగా సినిమాలన్నీ గురు, శుక్రవారాల్లో విడుదలవుతుంటాయి. ప్రపంచంలోని అత్యధిక స్థాయిలో సినిమాలు రూపొందించే భారత్ లో సినీరంగం ప్రముఖ వ్యాపారంగా సత్తాచాటుతోంది. ప్రధాని 500, 1000 రూపాయల నోట్లు రద్దు ప్రభావం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్ వుడ్, భోజ్ పురీ, పంజాబీ, బంగాళీ, మరాఠా సినీ పరిశ్రమలపై బలంగా పడింది.
‘ఇంట్లో దెయ్యం నాకేంటి భయ్యం’, ‘సాహసం శ్వాసగా సాగిపో’, ‘రాక్ ఆన్ 2’, ‘తుమ్ బిన్ 2’, ‘ఫోర్స్ 2’ వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మల్టీప్లెక్స్ ధియేటర్లు పెరిగిపోవడంతో టికెట్ల రేట్లు కూడా అందుకుతగ్గట్టే ఉన్నాయి. ఈ దశలో చేతిలో డబ్బులు లేక ప్రేక్షకులు సినిమాలకు వెళ్లేందుకు మొగ్గుచూపే అవకాశం లేదు. దీంతో వారం రోజుల వ్యాపార సూత్రంతో విడుదల కానున్న ఈ సినిమాల భవిష్యత్ పై నిర్మాతలకు బెంగపట్టుకుంది.