చిల్లర ఇవ్వండి.. ప్లీజ్

331
- Advertisement -

పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. నల్లదొంగల ఆట కట్టించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయంపై దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు బంద్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 500, 1000 రూపాయ‌ల నోట్లను ఒక్కసారిగా ర‌ద్దు చేయడంతో ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు చిల్ల‌ర కోసం నానా అవస్థలు ప‌డుతున్నారు. ఈ రోజు ఉద‌యం నుంచి ఐదు వందలు, వేయి నోట్లను తీసుకోవడానికి వ్యాపారులంద‌రూ నిరాకరిస్తుండ‌డంతో చిల్లర డబ్బులు కావాలంటూ ప్రజలు తిరుగుతున్నారు. ప్ర‌జ‌ల ఇబ్బందిని ప‌సిగ‌ట్టిన దళారులు ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. 500, 1000 రూపాయ‌ల నోట్ల‌పై 10 శాతం కమీషన్ తీసుకుని చిల్లర అందిస్తున్నారు.

  cur

నిన్న అర్థరాత్రి వరకూ పాత నోట్లు చలామణి అవుతాయని కేంద్రం, ఆర్‌బీఐ ప్రకటించినా దుకాణదారులు, హోటళ్ల యజమానులు మాత్రం ఈ మాటను పెడ చెవిన పెట్టారు. తినడానికి హోటల్‌కు వచ్చిన వ్యక్తిని 5వందలు, వెయ్యి రూపాయల నోటు ఇస్తే చిల్లర తీసుకురమ్మంటూ నిర్ధాక్షిణ్యంగా, నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు బంద్ కావడంతో సామాన్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తమ వద్ద ఉన్న విలువైన నోట్లను చిత్తు కాగితాలుగా పరిగణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇన నేడు ఏటీఎంలు, బ్యాంకులు వినియోగ‌దారుల‌కి అందుబాటులో లేవ‌న్న విష‌యం తెలిసిందే. దీంతో బ్యాంకుల నుంచి వంద, యాభై రూపాయ‌ల నోట్లు తీసుకోవ‌డానికి కూడా ప్ర‌జ‌ల‌కు అవ‌కాశం లేకుండా పోయింది. చిల్ల‌రలేక‌పోవ‌డంతో షాపింగ్ చేయ‌లేక‌పోతున్నారు. మెడిక‌ల్ షాప్‌లు, రైల్ టిక్కెట్లు వంటి చోట్ల మాత్ర‌మే పెద్ద నోట్ల‌ను స్వీక‌రిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వీరికున్న ఒకే ఒక్క ప్రత్యామ్నయం పెట్రోల్ బంకులు. పెట్రోల్ బంకుల్లో చిల్లర ఇవ్వడంతో సామాన్యులు కొంతవరకూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇదే అదనుగా భావించిన పెట్రోల్ బంకుల యాజమాన్యాలు తమ కపట బుద్ధిని బయటపెట్టుకున్నాయి. చిల్లర ఇస్తాం కానీ ఐదు వందలకు కొట్టించుకుంటేనే అనే నిబంధనను పెట్టాయి. దీంతో జనం అవసరం ఉన్నా, లేకపోయినా ఐదు వందలకు పెట్రోల్ కొట్టించుకుని చిల్లరను కళ్లకద్దుకుని మరీ తీసుకుంటున్నారు.

5PetrolHike_PTI

రేపటి నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు ప్ర‌జ‌లు త‌మ పెద్ద నోట్ల‌ని బ్యాంకుల్లో మార్చుకోవ‌చ్చు. న‌ల్ల‌ధ‌నం త‌ప్ప, స‌క్ర‌మంగా డ‌బ్బు సంపాదించి దాచి పెట్టుకున్న వారికి డిపాజిట్‌పై పరిమితి లేదని బ్యాంకర్లు తెలుపుతున్నారు. ప్ర‌జ‌లు త‌మ పెద్ద నోట్ల చలామణిపై ఆందోళన చెందే అనవసరం లేద‌ని సూచిస్తున్నారు. మోదీ తీసుకున్న నిర్ణయం నల్ల కుబేరులకు ఎలాంటి నష్టాన్ని కలిగించిందో తెలియదు కానీ, సామాన్యులకు, మధ్య తరగతి ప్రజలకు మాత్రం తప్పని కష్టాలను మిగిల్చింది.

- Advertisement -