కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ తీసుకున్న నిర్ణయంపై తమిళ హీరో సూర్య అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని సూర్య అభిప్రాయపడ్డాడు. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటం కోసమే చట్టాలు చేయాలని, అంతేగానీ, ఆ స్వేచ్ఛను నాశనం చేయడం కోసం కాదని సూర్య అన్నాడు. దీంతో సూర్యపై తమిళనాడు బీజేపీ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది.
తమిళనాడు బీజేపీ రాష్ట్ర యువజన కార్యవర్గం తాజాగా ఒక సమావేశం నిర్వహించింది. తమిళనాడు బీజేపీ యువజన విభాగం కార్యదర్శి వినోద్ సెల్వం అధ్యక్షతన సమావేశమైన కార్యవర్గం సూర్య వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమావేశం అనంతరం తమిళ బీజేపీ నేతలు సూర్యకు వార్నింగ్ ఇచ్చారు.
సూర్య తన సినిమాల గురించి మాత్రమే పట్టించుకోవాలని, ఇతర విషయాలపై అనవసర జోక్యం, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. సూర్య ఇదే రీతీలో కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారానికి పాల్పడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ యువజన విభాగం నేతలు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ హెచ్చరికలకు సూర్య ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.