సర్పంచ్ ఎన్నికల్లో తనను వెన్నుపోటు పొడిచారని, ఈ పరిణామానికి బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్ బాధ్యత వహించాలని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్ద పాపయ్య పల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థి సంగెం వెంకటస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ తరఫున సర్పంచ్‌గా పోటీ చేసిన ఆయన, పార్టీ అంతర్గత రాజకీయాల వల్లే తాను తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచార సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు తనకు ఎలాంటి సహకారం అందించలేదని వెంకటస్వామి ఆరోపించారు. పార్టీ తరఫున పోటీ చేస్తున్నప్పటికీ ప్రచారంలో ఒంటరిగా మిగిలిపోయానని తెలిపారు. ఈటల రాజేందర్ మద్దతు కోరుతూ వెళ్లిన సందర్భంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు రాములు కుమార్ తనను బెదిరించారని ఆయన ఆరోపించారు.
అదేవిధంగా బండి సంజయ్ చెప్పినట్లుగా వ్యవహరిస్తే అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ చివరకు ఆయన కూడా చేతులు ఎత్తేశారని వెంకటస్వామి మండిపడ్డారు. తనను బహిరంగంగా అవమానించి బజారు పాలు చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read:శ్రీశైలంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్
పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం, అంతర్గత కుట్రలే తన పరాజయానికి కారణమని వెంకటస్వామి పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తానని, ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు.

