తప్పు చేశా క్షమించండి..బీజేపీ ఎమ్మెల్యే వైరల్ వీడియో

41
bjp mla
- Advertisement -

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. గత ఐదేళ్ల యోగి సర్కార్ అసమర్థ పాలనతో యుపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. దేశంలోనే అన్ని రంగాల్లో వెనుకబడిన రాష్ట్రంగా యుపీ చెత్త రికార్డు నెలకొల్పింది. కాగా ఇప్పటికే మూడు విడతలుగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎస్పీ కంటే వెనుకబడి పోయిందని వార్తలు వస్తున్నాయి. దీంతో కాషాయపెద్దలు రంగంలోకి దిగి బీజేపీ తరపున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అఖిలేష్ యాదవ్‌ అధికారంలోకి వస్తే అవినీతి, అరాచకం రాజ్యమేలుతాయంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అయితే బీజేపీ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేంద్రమంత్రులు, యోగి కేబినెట్‌ మంత్రులతో సహా ప్రజల్లో వెళ్లి ఓటు అడిగేందుకు మొహం చెల్లడం లేదు. ధైర్యం చేసి ప్రచారానికి వెళుతున్న బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు తమ గ్రామాల నుండి తరిమికొడుతున్నరు. అయితే తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో తప్పు అయిపోయింది..ఈసారికి క్షమించండి అంటూ గుంజీలు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. రాబర్ట్స్‌గంజ్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే భూపేష్ చౌబే ఈసారి కూడా అదే స్థానం నుంచి తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. స్థానిక ప్రజలకు ఆ ఎమ్మెల్యేపై ఆగ్రహం ఉన్నప్పటికీ బీజేపీ మళ్లీ టికెట్‌ ఇచ్చింది. గత ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని పట్టించుకోని బీజేపీ ఎమ్మెల్యే భూపేష్ చౌబే మళ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజల ముందుకు రాకతప్పలేదు.

మార్చి 7న జరిగే చివరి ఏడో దశలో ఇక్కడ పోలింగ్‌ జరుగనుంది. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తన నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే భూపేష్ చౌబే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను, నియోజకవర్గం ప్రజలను పొడగ్తలతో ముంచెత్తారు. మరోసారి వారి ఆశీసులు తనకు కావాలని కోరారు. 2017లో మాదిరిగా తనను ఎమ్మెల్యేగా తిరిగి గెలిపించాలని అభ్యర్థించారు. ఐదేండ్ల కాలంలో తాను చేసిన తప్పులను క్షమించాలని వేడుకున్నారు. అక్కడితో ఆగక కుర్చీపైకి ఎక్కి చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు కూడా తీశారు.. గత ఐదేండ్లలో తన వల్ల జరిగిన తప్పులను క్షమించి మళ్లీ గెలిపించాల్సిందిగా ప్రజలను వేడుకున్నాడు.. అయితే వేదికపై ఉన్న మిగతా బీజేపీ నేతలు వారించేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే భూపేష్ చౌబే మాత్రం గుంజీలు తీస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే భూపేష్ చౌబే గుంజీల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓట్ల కోసం బీజేపీ నేతలు భలే తిప్పలు పడుతున్నారంటూ నెట్‌జన్లు తెగ సెటైర్లు వేస్తున్నారు.

- Advertisement -