అసెంబ్లీలో జరుగుతున్న చర్చల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మన రాజకీయ నాయకుల ప్రవర్తన వల్లే బయట కొందరు ప్రజాప్రతినిధులపై గౌరవం లేకుండా మాట్లాడే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. శాసనసభలో మాటల స్థాయి పడిపోతే సమాజంలోనూ అదే ప్రభావం కనిపిస్తుందని అన్నారు.
కొత్తగా ఎన్నికైన సభ్యులు తప్పనిసరిగా గౌరవం, మర్యాదలతో మాట్లాడే సంస్కృతి అలవర్చుకోవాలని వెంకటరమణారెడ్డి సూచించారు. భవిష్యత్తులో సభకు వచ్చే సభ్యులకు మనమే ఆదర్శంగా నిలవాలని, ప్రస్తుతం ఉన్న సభ్యుల ప్రవర్తనే రేపటి రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. సభ ఒక గౌరవప్రదమైన వేదిక అని, అక్కడ ఉపయోగించే ప్రతి మాటకు బరువు ఉంటుందని గుర్తుచేశారు.
ఇటీవల చాలా మంది ప్రజాప్రతినిధులు ప్రస్తుత సీఎం, మాజీ సీఎంలు, ప్రధాని పట్ల కూడా అగౌరవంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. చిన్ననాటి మిత్రులు లేదా క్లాస్‌మేట్స్‌తో మాట్లాడినట్లు సంభోదించడం సరికాదని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ఇలాంటి ప్రవర్తన వల్ల ప్రజల్లో రాజకీయ వ్యవస్థపై నమ్మకం తగ్గుతుందని హెచ్చరించారు.
Also Read:KTR:ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డోర్స్ క్లోజ్
సభలో వ్యక్తిగత దూషణలు కాకుండా అర్థవంతమైన విమర్శలు, ప్రతివిమర్శలు జరగాలి అని వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. విధానాలపై చర్చ, ప్రజా సమస్యలపై వాదనలు జరగాలి తప్ప వ్యక్తిగత అవమానాలకు సభ వేదిక కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

