తెలంగాణలో సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, డబుల్ బెడ్‌రూంఇండ్లు, కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మాకు కూడా కావాలని బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో బీజేపీ పాలనలో ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్‌లోని పలు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలిపేయాలంటూ ఆందోళలు నిర్వహించారు.
ఏకంగా హైదరాబాద్‌కు వచ్చి తమను తెలంగాణలో కలిపేసుకోండి అంటూ సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం కూడా ఇచ్చారు. అయినా కేంద్రం వాళ్లు గోడు పట్టించుకోకపోవడంతో ఏకంగా తమ గ్రామాలను తెలంగాణలో కలిపేయండి..కేసీఆర్ పాలనలో చల్లగా బతుకుతాం అంటూ ఏకంగా రాష్ట్రపతికి లేఖ కూడా రాశారు. ఇప్పుడు కర్ణాటక జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఏకంగా రాయచూర్ జిల్లాను తెలంగాణలో విలీనం చేయండి అంటూ డిమాండ్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా రాయచూర్‌లో జరిగిన ఓ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ మాట్లాడుతూ.. ఉత్తర కర్ణాటకలో హుబ్లీ, ధార్వాడ్, బెంగళూరును పట్టించుకొంటున్నారని, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో గుల్బర్గా, బీదర్‌ను మాత్రమే చూస్తున్నారని.. తమ రాయచూర్ బాగోగులు, సమస్యలను తమ బీజేపీ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు. రైతులు, ఇతర అన్ని వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అమలుచేస్తున్నారని కితాబు ఇచ్చారు. తెలంగాణలోని సంక్షేమ పథకాలను తమ గ్రామాల్లోనూ అమలుచేయాలని.. అలా చేయలేకపోతే.. తెలంగాణలో కలిపేయాలని డిమాండ్‌చేశారు.
గతంలోనూ మహారాష్ట్రలోని కిన్వట్, మాహోర్ తాలూకాలోని పలు గ్రామాల రైతులు నాందేడ్ జిల్లా కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సైతం ఇచ్చారు. తాజాగా ఇప్పుడు కర్ణాటక ఎమ్మెల్యే శివరాజ్ రాయచూర్‌ను తెలంగాణలో కలపాలంటూ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను టీఆర్ఎస్ నేత క్రిశాంక్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. గతంలో మహారాష్ట్ర నాందేడ్ నుంచి స్థానిక నాయకులు వచ్చి తెలంగాణలో కలపండని కోరడం చూశామని.. ఇప్పుడు ఏకంగా బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ శివరాజ్ రాయచూర్‌ను తెలంగాణలో కలపాలని కోరడం.. ప్రజలు చప్పట్లతో స్వాగతించడం గొప్ప విషయమని క్రిశాంక్ అన్నారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. క్రిశాంక్ పోస్ట్ చేసిన వీడియోను షేర్ చేసిన మంత్రి కేటీఆర్…. ‘తెలంగాణ ఖ్యాతి సరిహద్దులు దాటింది.. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాయచూర్‌ను తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారు. అక్కడున్న ప్రజలంతా ఆయన సూచనను చప్పట్లతో స్వాగతించారు’ అంటూ ట్వీట్‌చేశారు. కేటీఆర్ ట్వీట్‌పై వందల సంఖ్యలో నెటిజన్లు స్పందించారు. ఈ వీడియో చూస్తే కేసీఆర్‌పై పొద్దున లేస్తే అడ్డగోలుగా విమర్శలు చేసే ఈటల రాజేందర్, బండి సంజయ్‌లు వంటి బీజేపీ నేతలు సిగ్గుతో తలదించుకుంటారని నెట్‌జన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో కేసీఆర్ పాలన భేష్.. తమ రాయచూర్ జిల్లాను తెలంగాణలో కలిపేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ చేసిన వ్యాఖ్యలు బండి బ్యాచ్‌కు షాకింగ్‌గా మారాయనే చెప్పాలి.