ఇన్నాళ్లూ లోక్‌సభలో బంపర్ మెజార్టీ ఉన్నా.. రాజ్యసభలో ప్రతిపక్షాలకు తలొగ్గిన బీజేపీకి ఇక ఆ అవసరం లేదు. పార్టీ పుట్టిన తర్వాత పెద్దల సభలో ఫస్ట్ టైం నంబర్ వన్ పొజిషన్ కు వచ్చింది బీజేపీ. ఇన్నాళ్లు సెకండ్, థర్డ్ లోనే ఉంది. రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను మించి సభ్యులు ఇప్పుడు బీజేపీకి ఉన్నారు. 245 స్థానాలున్న పెద్దల సభలో బీజేపీ బలం 58కి పెరిగింది.
తెలంగాణకు చెందిన పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మణిపూర్‌కు చెందిన హజీ అబ్దుల్ సలామ్‌ల మరణాలతో కాంగ్రెస్ పార్టీ ఎంపీల సంఖ్య 57కు పడిపోయింది. దీంతో 65 ఏళ్లుగా రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా కొనసాగుతున్న కాంగ్రెస్ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. అయినప్పటికీ, అధికార ఎన్డీఏకు పెద్దలసభలో మెజారిటీ లేకపోవడం గమనార్హం. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు వచ్చిన బీజేపీ ఎంపీ సంపతియా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే మృతితో సంపతియా ఎన్నిక తప్పలేదు.
పెద్ద పార్టీ’గా కాంగ్రెస్ 2018 వరకూ కొనసాగాల్సి ఉన్నా, సభ్యుల అకాల మరణాలతో ముందుగానే రికార్డు కోల్పోవాల్సి వచ్చింది. ఇక ముందు కూడా కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఆగస్టు 8న గుజరాత్, పశ్చిమబెంగాల్‌లలోని 9 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మూడు సీట్లున్న గుజరాత్‌లో రెండింటిలో బీజేపీ విజయం ఖాయమైపోయింది.మిగిలిన ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకుని అహ్మద్ పటేల్(సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి)ని రాజ్యసభకు రానీయకూడదని బీజేపీ ఎత్తులు వేస్తోంది. ఇక వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి అయితే రాజ్యసభ చైర్మన్‌గా ఆయన సారథ్యంలో వ్యవహారాలు మరింత సాఫీగా సాగిపోతాయని బీజేపీ భావిస్తున్నది. ఉప రాష్ట్రపతికి రాజ్యసభ ఎక్స్ అఫిషియో చైర్మన్ హోదా ఉంటుంది.