అసమ్మతి సెగ…బండికి చుక్కలే!

97
bandi
- Advertisement -

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం దేవుడెరుగు కాని..సొంత జిల్లాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌‌కు అసమ్మతి నేతలు చుక్కలు చూపిస్తున్నరు. . వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కావాలని బండి సంజయ్ పట్టుదలగా ఉన్నాడు..మరోవైపు తాను ఎంపీగా పోటీ చేసినా చిత్తుగా ఓడిపోతానని బండికి తెలుసు…అలాగే కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసినా..మళ్లీ గంగుల చేతిలో ఓటమి తప్పదని బండికి భయం పట్టుకుంది…అందుకే సేఫ్‌ సైడ్‌గా బండి వేములవాడ అసెంబ్లీ సీటుపై కన్నేసాడు..ఈమేరకు..వేములవాడలో తరచుగా పర్యటిస్తూ హల్‌చల్ చేస్తున్నాడు. పలు పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నాడు. వేములవాడ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో హిందూత్వ సెంటిమెంట‌్ రగిలించి ఈజీగా గెలవచ్చని బండి ప్లాన్ వేశాడు. అయితే అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా వచ్చేసారి చల్మెడ లక్ష్మీ నరసింహారావు వంటి బలమైన స్థానిక నాయకుడు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. చల్మెడనున ఓడించడం అంత ఈజీకాదు.

మరోవైపు ఇటీవల కరీంనగర్‌లో 100 మందికి పైగా బీజేపీ పాత సీనియర్ నేతలతో సీక్రెట్ మీటింగ్ నిర్వహించి అధ్యక్షుడు బండి సంజయ్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేసిన అసమ్మతి కూటమి నాయకుడు పొలసాని సుగుణాకర్‌‌రావు రూపంలో బండి సంజయ్‌కు మరో గండం ఎదురుకానుంది. కాగా బండి సంజయ్‌పై తిరుగుబాటు చేసిన అసమ్మతి నేతలపై ఆగ్రహంవ్యక్తం చేసిన బీజేపీ హైకమాండ్ ఈ విషయమై సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని రంగంలోకి దింపింది. ఈమేరకు సుగుణాకర్‌రావుతో సహా పలువురు బీజేపీ సీనియర్లతో భేటీ అయిన ఇంద్రసేనారెడ్డి బండిపై తిరుగుబాటుకు గల కారణాలపై ఆరా తీశారు. అయితే బండికి వ్యతిరేకంగా ఇంత రచ్చ చేసినా..హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అసమ్మతి నేతలు మరింత దూకుడు పెంచారు. బండికి వ్యతిరేకంగా జిల్లా రాజకీయాల్లో పావులు కదుపుతున్నారు.

బీజేపీలో సీనియర్‌గా ఉన్న పొలసాని సుగుణాకర్‌రావు కన్వీనర్‌గా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పోరాట సమితి పేరుతో ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పేరుతో వేములవాడలో నిరసన కార్యక్రమాలు చేయడం బీజేపీ శ్రేణుల్లో చర్చగా మారింది. అయితే సుగుణాకర్‌రావు పార్టీ పేరుతో కాకుండా స్వతంత్రంగా ధర్నాలుకు దిగుతున్నారట. దీనిపై బీజేపీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం. అసలు బండి సంజయ్ తమ స్థాయి కాదని, కార్పొరేటర్ స్థాయి నుంచి అనూహ్యంగా ఎంపీగా కాకముందే జిల్లాలో బీజేపీని తామే నిలబెట్టామని.. అలాంటిది తమను అన్ని విధాలుగా పక్కన పెట్టేశారని బీజేపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారట. ఇప్పుడు వేములవాడ ఆలయం సాక్షిగా బీజేపీ అంతర్గతపోరు మరోసారి బయటపడింది. బండి సంజయ్‌ వచ్చే ఎన్నికల్లో వేములవాడ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తారని వార్తలు రావడంతో అసమ్మతి వర్గం తమ ఫోకస్ కరీంనగర్ నుంచి వేములవాడకు మార్చింది. దీంతో బీజేపీ పెద్దలు అప్రమత్తమై నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టారట. వేములవాడ రాజన్న అభివృద్ధి పోరాట సమితికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ప్రకటన చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పోరాట సమితి పేరుతో నిర్వహించిన ధర్నాకు బీజేపీ నాయకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. దీంతో బండి సంజయ్ వర్గం ఉలిక్కిపడిందంట.. మొత్తంగా కరీంనగర్‌లోనే కాకుండా వేములవాడలో కూడా అసమ్మతి వర్గం రంగంలోకి దిగడం బండి సంజయ్ వర్గానికి షాకింగ్‌గా మారిందనే చెప్పాలి. వేములవాడలో బండి సంజయ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినా అసమ్మతి వర్గం ఆయన ఓటమికి పని చేయడం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడం అంత ఈజీ కాదని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

- Advertisement -