పేదల పథకాలపై కేంద్రం కన్నెర్ర
సంక్షేమ పథకాల రద్దుకు రాష్ట్రాలపై వత్తిడి
పెన్షన్ల పథకాల రద్దు దిశగా కేంద్రం అడుగులు
అగ్గికి ఆజ్యం పోసిన ఎస్.బి.ఐ.నివేదిక
అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డు
తెలంగాణలోని పథకాలే కేంద్రం టార్గెట్..?
తెలంగాణ రాష్ట్రంలో గడచిన ఏడేళ్ళుగా విజయవంతంగా అమలవుతున్న సంక్షేమ పథకాలన్లీ ప్రమాదంలో పడిపోయాయి. ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు ప్రభుత్వాల ఖజానాలపై భారంగా మారాయని, వాటిని ఎలాగైనా కేంద్రంలో రద్దు చేయాలని, రాష్ట్రాల్లోనూ ఈ పథకాలను రద్దు చేయించాలని చాలా సీరియస్ గా కేంద్ర సర్కార్ పావులు కదుపుతోందని కొందరు సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఆసరా పెన్షన్లు, వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచితంగా ఇస్తున్న విద్యుత్తును కూడా రద్దు చేయించడం కోసమే కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తూనే ఉందని వివరించారు. ఉచితాలు, సంక్షేమ పథకాలు రద్దయ్యే ప్రక్రియలో ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టుకోకుండా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలనే నిందించే విధంగాచేయాలని, అందుకు తగినట్లుగా కేంద్రం పావులు కదుపుతోందని తెలిపారు. ఉచితాలు, ఉచిత విద్యుత్తు పథకం, ఆసరా పెన్షన్లు వంటి జనరంజక పథకాలను రద్దు చేస్తే దాని ప్రభావం తెలంగాణ ప్రజలపై చాలా తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత టి.ఆర్.ఎస్. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను యధావిధిగా దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్లు రావడం, చివరకు బి.జే.పీ. పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్ పథకాలను అమలుచేయాలనే వత్తిడి కేంద్రంపై తీవ్రంగా ఉందని వివరించారు. ఈ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయలేక, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలపైన ఆంక్షలు విధించి ఉచిత పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్రాలే స్వయంగా రద్దు చేసుకునే విధంగా చేయాలని, అందుకు తగినట్లుగా తెలంగాణ వంటి రాష్ట్రాలపై ఆర్థిక ఆంక్షలు విధించడమే కాకుండా, ఆర్ధికంగా నష్టాలు కలిగిస్తే నిధులు లేక ఎవ్వరికి వారే ఈ ఉచిత పథకాలను రద్దు చేసుకుంటారనే వ్యూహంతోనే కేంద్రం వ్యవహరిస్తోందని వివరించారు.
ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టంలో మార్పులు చేశారని, అంతేగాక గతించిన సంవత్సరాల్లోని అప్పలను కూడా తాజా ఉత్తర్వుల పరిధిలోకి తీసుకొచ్చి కొత్తగా రుణాలు సేకరించకుండా కేంద్రమే అడ్డుపుల్లలు వేస్తోందని, అంతేగాక తెలంగాణకు ఇవ్వాల్సిన 34 వేల కోట్ల రూపాయల బకాయిలను కూడా ఇవ్వకుండా ఎగొట్టిందని ఆ అధికారులు వివరించారు.
ఉచితాలు, పెన్షన్ల పథకాలు, ఇతర సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో పనిచేస్తున్న కేంద్రానికి అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్.బి.ఐ) గ్రూప్ చీఫ్ ఎకనమిక్స్ అడ్వైజర్ సౌమ్యకాంతిఘోష్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రూపొందించిన నివేదిక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న రాష్ట్రాలకు గొడ్డలిపెట్టుగా మారిందని ఆ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనికితోడు సుప్రీంకోర్టు నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సిఫారసులను అమలుచేస్తూ రాష్ట్రాలు ఇచ్చే ఉచితాలను రద్దు చేయించే ఉత్తర్వులు జారీ చేయించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోందని ఆ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.
అదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుమారు24 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయ రంగానికి ఇచ్చే ఉచిత విద్యుత్తు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా సుమారు 10 వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేస్తోంది. ఈ ఉచిత విద్యుత్తు పథకాన్ని రద్దు చేయండని నేరుగా చెప్పకుండా బావుల వద్ద మీటర్లు పెట్టాలని ఆదేశించడం వంటివి చేష్టలతో కేంద్రం తెలంగాణ రైతన్నల నడ్డి విరిచే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు.
ఆసరా పెన్షన్ల పథకం నుంచి తెలంగాణలో 37 లక్షల 34 వేల మంది లబ్ది పొందుతున్నారు. ఆసరా పెన్షన్ల పతకానికి ఏటా 7,800 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అంతేగాక రైతు బంధు, రైతు భీమా, దళితబంధు, కె.సి.ఆర్.కెట్లు, ఉచితంగా గొర్రెల పంపిణీ, చేపపిల్లల పంపిణీలతో పాటుగా బిసీ, ఎస్సీ, ఎస్టీల పిల్లలు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అందిస్తున్న 20 లక్షల రూపాయల పథకాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పేదలను ఆదుకునే పథకాలన్నింటిపైనా కేంద్రం కన్నేసిందని వివరించారు.
ఉచితాలు, సబ్సిడీలు, సంక్షేమ పథకాలను రద్దు చేయించడానికి కేంద్రం తీసుకునే నిర్ణయాలు తెలంగాణ వంటి సంక్షేమ రాష్ట్రాల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఉచితాలను రద్దు చేయించే విషయంలో తన చేతికి మట్టి అంట కుండా ఈ పథకాలన్నీ రద్దయ్యే మార్గాలను అన్వేషించే కార్యక్రమంలో భాగంగానే సుప్రీంకోర్టు కమిటీలను రంగంలోకి దించిందని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, ఉచిత విద్యుత్తు వంటి పథకాలు ప్రమాదంలో పడ్డాయని, మరికొన్ని రోజుల్లో వీటి రద్దుకు సంబంధించి మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.
సుప్రీంకోర్టు కమిటీలు, ఎస్.బి.ఐ.నిపుణుల కమిటీల పేరుతో సిఫారసులను తమకు అనుకూలంగా తెప్పించుకొని వాటిని అమలుచేయడం ఒక ఎత్తుగడ కాగా, ఉచితాలను రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం నుంచే ఆదేశాలు వెలువడేటట్లుగా చేయడం మరో ఎత్తుగడగా కేంద్రం వ్యూహాలు పన్నుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రానున్న రోజుల్లో ఉచితాల రద్దు ప్రయత్నాల్లో కేంద్రం సఫలమవుతుందా..? లేక వెనక్కు తగ్గుతుందా..? అనే తేలాలంటే మరికొంత సమయం వేచి చూడాలి…