రాష్ట్రంలో ఇప్పుడు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించగా, ఇప్పుడు బీజేపీ కూడా తన అభ్యర్థిని ఖరారు చేసింది. నాగార్జునసాగర్ బరిలో తమ అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవికుమార్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. మంగళవారం రవికుమార్ నామినేషన్ వేయనున్నారు.
సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణం చెందడంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. నోముల కుమారుడు నోముల భగత్‌కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత జానారెడ్డి బరిలో దిగారు. కాగా, బీజేపీ అభ్యర్థి రేసులో కంకణాల నివేదితా రెడ్డి పేరు కూడా వినిపించింది. అధిష్ఠానం అభ్యర్థిని ఎంపిక చేయకముందే ఆమె నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఉప ఎన్నికలో కీలక ఘట్టం నామినేషన్లపర్వం ము గియగానే ఈ నెల 31 నుంచి ప్రచార పర్వంలో దూసుకుపోయేందుకు అభ్యర్థులు ఆసక్తిగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్రస్థాయి నాయకులు, మంత్రులు, సినీ గ్లామర్ ఇలా ఓటర్లను ఆకట్టుకునే విధంగా సాగర్‌లో ఊరూర ప్రచారం చేయనున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో రోజురోజుకూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే పార్టీలు మారడం ప్రారంభం కాగా, వచ్చే రోజుల్లో అవి మరింత ఊపందుకోనున్నాయి.