పెళ్లి కానీ అమ్మాయి కావాలట….!

215
Bigg Boss Telugu 5th day highlights
- Advertisement -

ఐదు రోజుల కిందట భారీ అంచనాల మధ్య  ప్రారంభమైంది తెలుగు ‘బిగ్ బాస్’. ఐతే ఈ షోను ఆసక్తికరంగా నడిపించేంత స్టామినా పార్టిసిపెంట్లకు ఉందా అంటూ చాలామంది వ్యక్తం చేసిన సందేహాలు నిజమయ్యేలాగే కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఎపిసోడ్లు ప్రేక్షకులకు తెగ బోర్ కొట్టిస్తున్నాయి.

దీంతో బిగ్ బాస్‌ షోకు ఆదరణ పెంచేందుకు నిర్వాహకులు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా పేరున్న నటులను తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో  బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న యువ కథానాయకుడు ప్రిన్స్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనొక్కడే లీజర్‌గా ఉన్న సమయంలో ప్రిన్స్ కెమెరాల వైపు చూస్తూ ఓ విన్నపం చేశాడు. హౌస్‌లో అందరూ పెళ్లయిన అమ్మాయిలే ఉంటున్నారని.. వాళ్లంతా బోరింగ్ టాపిక్స్ మాట్లాడుతున్నారని.. పచ్చళ్ల గురించి.. వంటల గురించి చర్చలు పెడుతూ.. గొడవలు పడుతున్నారని.. తాను వాళ్లతో కనెక్టవ్వలేకపోతున్నానని.. బోర్ కొడుతోందని.. తనకు సరిపోయే పెళ్లికాని అమ్మాయిలెవరినైనా హౌస్‌లోకి తీసుకొస్తే బాగుంటుందని అన్నాడు ప్రిన్స్.

తాను జిమ్ చేయాలన్నా కూడా ఒక మోటివేషన్ అవసరం అవుతోందని.. కాబట్టి ఓ అమ్మాయిని హౌస్‌లో తీసుకొస్తే బాగుంటుందని అతనన్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పలువురు సెలబ్రిటీలు ఎంట్రీ ఇస్తారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రిన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మరోవైపు ఐదో ఎపిసోడ్‌లో క్రమశిక్షణ తప్పిన ఇంటి సభ్యులపై బిగ్‌బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీక్రెట్ టాస్క్‌ పూర్తి చేయడంలో విఫలమైన సమీర్‌ని స్వయంగా బిగ్ బాస్ వచ్చేవారం ఎలిమినేషన్‌కి ఎంపిక చేశారు. అదే విధంగా ఇంటి కెప్టెన్‌గా ఉంటూ.. అలక్ష్యంగా వ్యవహరించిన సంపూర్ణేష్ బాబుని ఆ బాధ్యతల నుంచి బిగ్ బాస్ తొలగించారు. ఇంటి పనులు చేయకపోవడం, సభ్యులతో స్నేహపూరిత వాతావరణం పెంపొందించుకోవడంలో సంపూ ఘోరంగా విఫలమయ్యాడని బిగ్‌ బాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరంభంలోనే సంపూ వైఖరిపై సభ్యులందరూ పెదవి విరిచినా.. తీరు మార్చుకోవడానికే కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించి ఒక అవకాశమిచ్చినట్లు బిగ్‌ బాస్ వెల్లడించారు. కానీ.. సంపూ తీరు తీవ్ర అసంతృప్తి కలిగించిందని.. అతను ఇంకెప్పుడూ ఇంటి కెప్టెన్‌ కాలేడని బిగ్‌ బాస్ ప్రకటించారు

- Advertisement -