కమల్‌హాసన్ తన నటన, పాత్రలతో ఎల్లలు లేని అభిమానులను సొంతం చేసుకుని ‘లోకనాయకుడు’ అనిపించుకున్నారు. వెండితెరపై ప్రయోగాత్మక పాత్రలకి ప్రాణం పోసిన నటుడు. అంతేకాదు.. నిర్మొహమాటంగా తన అభిప్రాయం వెల్లడించడంలో కమలహాసన్ ముందుంటారు. కొత్తదనానికి కొత్త దారులు తెరచిన కమల్, ఇప్పుడు బిగ్ బాస్ షోతో బుల్లితెరపై సందడి చేస్తున్నాడు.
హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ షోని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని తమిళంలో కమల్ హాసన్ చేస్తున్న తమిళ బిగ్ బాస్ షోలో 14 మంది పార్టిసిపెంట్స్ పాల్గొంటున్నారు. ఈ షోలో రానున్న 100 రోజులపాటు ఈ పార్టిసిపెంట్స్ ఒకే ఇంట్లో ఉంటారు. విజయ్ టీవీ ఛానెల్ ప్రసారం చేస్తున్న ఈ షో ఆల్రెడీ మొదలైపోయింది. అయితే ఈ బిగ్ బాస్ షోపై తమిళ ప్రజల నుండి వ్యతిరేఖత వస్తోంది. కమల్ హాసన్ పై తమిళ సంఘాలు కేసు కూడా వేశాయి.
దీనిపై తనదైన శైలిలో స్పందించిన కమల్.. 37 ఏళ్లుగా తనకంటూ ఉన్న పాప్యులారిటీ ఉందన్నారు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ కోసం నేను తప్పు చేస్తానా? అంటూ ప్రశ్నించారు.. ఈ షో వల్ల సంప్రదాయాలు చెడిపోతాయనుకుంటే… గత 11 ఏళ్లుగా ఏం చేస్తున్నారు? హిందీలో వస్తే సంప్రదాయాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదా?… మరి సినిమాల్లో వచ్చే ముద్దుల సీన్ల వల్ల జరిగేది ఏమిటి?… ఆ సీన్లలో నటించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? నేను ముద్దు సీన్లలో నటించినప్పుడు వాళ్లు ఎందుకు అడగలేదు? ’’ అని ఆయన నిలదీశారు. కొందరికి ఏదో ఒక రాద్ధాంతం చేయడం అలవాటని ఆయన అభిప్రాయపడ్డారు. తానేం చేసినా కొంత మందికి నచ్చదని ఆయన తెలిపారు.
ఇక రజనీ రాజకీయ ప్రవేశంపై తన అభిప్రాయం వెల్లడిస్తూ…‘‘సిస్టమ్ బాగాలేదని రెండేళ్ల క్రితమే చెప్పానన్నారు.. రజనీ ఈ మధ్య కొత్తగా చెప్పారు, అంతే. ఒకవేళ ఆయన పార్టీ పెడితే… న్యాయంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది. ఒకవేళ న్యాయంగా లేకపోతే ఈ రోజు నేను ఏ విధంగా పార్టీలను విమర్శిస్తున్నానో అలాగే రజనీని కూడా విమర్శిస్తాను. అందులో రజనీకి ఎలాంటి మినహాయింపు ఉండదు’’ అని ఆయన స్పష్టం చేశారు. తాను జీఎస్టీని వ్యతిరేకించలేదని, అదే సమయంలో జీఎస్టీ సినిమాను నష్టపరిచేలా ఉండకూడదని మాత్రం చెబుతానని ఆయన స్పష్టం చేశారు.
కాగా తమిళ సంఘాలు తక్షణం కమల్ హాసన్ బిగ్‌బాస్ షో నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ షో తమిళుతో పాటు, తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలను మంటగలుపుతోందని వారు మండిపడుతున్నారు. కాగా, బిగ్ బాస్ షోలో సెలెబ్రటీలు కెమెరాల ముందు జీవించాల్సి ఉంటుంది. ఒకే ఇంట్లో ఒకే చోట వారి జీవనం ఉంటుంది. కంచం, మంచం, బాత్రూం వంటివన్నీ ఒకే చోట ఉంటాయి. అయితే ఈ విధానంపై పలువురు తమిళులు మండిపడుతున్నారు. ఈ బిగ్ బాస్ ప్రారంభంలోనే ఇంత వ్యతిరేకత మొదలైంది.