బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఆరోవారం నామినేషన్లు హాట్‌హాట్‌గా సాగాయి. మంగళవారం ప్రసారమైన 38వ ఎపిసోడ్లో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ముఖ్యంగా రోహిత్, షాలిని జంటను పలువురు హౌస్మేట్స్ టార్గెట్ చేయడంతో ఇంట్లో వాతావరణం వేడెక్కింది. వర్షిణి, వంశీ, త్రిగుణ్‌లతో గొడవలు జరగగా.. నరేష్ చేసిన వ్యాఖ్యలు ఎపిసోడ్లో హైలైట్‌గా నిలిచాయి.
నామినేషన్లలో మొదట షాలిని.. యాంకర్ వర్షిణిని టార్గెట్ చేసింది. ఇతరులను తక్కువగా చూస్తున్నావంటూ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో త్రిగుణ్, రోహిత్ మధ్యలో కలగజేసుకోవడంతో గొడవ మరింత పెరిగింది. అనంతరం త్రిగుణ్ షాలిని భుజంపై చేయి వేయడాన్ని చూసి రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. షాలిని తనను ప్రేమిస్తున్నానని చెబుతూ మరొకరితో అలా ఉండటం బాధ కలిగించిందని అన్నాడు. దీనిపై షాలిని తాను త్రిగుణ్‌ను సోదరుడిలా చూస్తున్నానని చెప్పినా రోహిత్ శాంతించలేదు.
మరోవైపు, షాలినిని నామినేట్ చేస్తున్న సమయంలో రోహిత్ పదేపదే మధ్యలో జోక్యం చేసుకోవడంపై దేబ్జానీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత వంశీ, రోహిత్ మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకోవడంతో హౌస్‌లో ఉద్రిక్తత నెలకొంది. షాలిని ప్రవర్తన, ఇతరులను తక్కువగా చూడటం, ఆహారాన్ని వృథా చేయడం వంటి అంశాలను వంశీ నామినేషన్ సందర్భంగా ప్రస్తావించాడు.
ఆహారాన్ని దాచిపెట్టి వృథా చేస్తున్నారన్న ఆరోపణలపై కెప్టెన్ సుధీర్ ప్రశ్నించగా, షాలిని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు ఎపిసోడ్లో చూపించారు. మరోవైపు త్రిగుణ్ కూడా రోహిత్‌ను నామినేట్ చేస్తూ తన కుటుంబ విషయాలను ప్రస్తావించవద్దని హెచ్చరించాడు. రోహిత్ వల్లే అతని చుట్టూ ఉన్న స్నేహితులు దూరమవుతున్నారని విమర్శించాడు.
అయితే నరేష్ నామినేషన్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతంలో తన ఆటను తక్కువ చేసి మాట్లాడిన రోహిత్, షాలినిలకు నరేష్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. చరణ్‌ను ప్రోత్సహించాలని చెప్పిన వారే చివరకు షాలినికి మద్దతు ఇచ్చారని ప్రశ్నించాడు. నరేష్ ప్రశ్నలకు రోహిత్ సరైన సమాధానం ఇవ్వలేకపోవడంతో హౌస్మేట్స్ చప్పట్లతో స్పందించారు.
Also Read:ది ట్రైటర్స్ తెలుగు..క్లోక్‌మెన్ సందడి
చివరగా వంశీ, వర్షిణి, అమన్, రోహిత్, షాలిని నామినేషన్లో ఉండగా, కెప్టెన్ సుధీర్‌కు ఇచ్చిన ప్రత్యేక అధికారంతో రామ్ ప్రసాద్ కూడా నామినేట్ అయ్యాడు. దీంతో ఆరోవారం ఎలిమినేషన్‌కు ఆరుగురు పోటీలో నిలిచారు. చివర్లో రామ్ ప్రసాద్, నరేష్ మధ్య జరిగిన బురద సన్నివేశం ప్రేక్షకులను నవ్వించింది.

