విషపూరితమైన ఉమ్మెత్త (దతురా) మొక్క ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నందుకు గాను అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ మరియు బిగ్‌బాస్కెట్ ప్లాట్‌ఫామ్‌ల ఆహార లైసెన్సులను సస్పెండ్ చేస్తూ కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌ల నుండి మానవ వినియోగం కోసం ఉద్దేశించిన ఉత్పత్తులను తక్షణమే తొలగించాలని ఆదేశించడమే కాకుండా వీటిని సరఫరా చేస్తున్న విక్రేతలపై కూడా చర్యలు తీసుకుంది. ఆహార భద్రతా శాఖ జరిపిన తనిఖీల్లో ఉమ్మెత్త పండ్లు, విత్తనాలను మానవ వినియోగం కోసం ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు తేలింది.
అధికారులు జరిపిన తనిఖీల్లో ఉమ్మెత్త పండ్లు మరియు విత్తనాల ప్యాకెట్లపై FSSAI లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్లు ఉండడాన్ని గమనించారు. ఇవి ఆహార ఉత్పత్తులుగా ఎలా జాబితా చేయబడి, విక్రయించబడుతున్నాయనే దానిపై అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార లైసెన్సులను కర్ణాటక ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసింది?ఉమ్మెత్త అత్యంత విషపూరితమైనదని, దానిని తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు తలెత్తుతాయని శాఖ పేర్కొంది. ఈ విషయాలను గుర్తించిన అధికారులు, మానవ వినియోగానికి ఉమ్మెత్తను ఆఫర్ చేస్తున్న అన్ని ఆన్‌లైన్ లిస్టింగ్స్ మరియు ప్రకటనలను తక్షణమే తొలగించాలని ఈ మూడు ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించారు. ఉమ్మెత్తను ఆహార పదార్థంగా విక్రయించడం, పంపిణీ చేయడం లేదా ప్రదర్శించడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
కేవలం ప్లాట్‌ఫామ్‌లపైనే కాకుండా, ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు ఉమ్మెత్త ఉత్పత్తులను సరఫరా చేస్తున్న విక్రేతలు మరియు సంస్థల లైసెన్సులు లేదా రిజిస్ట్రేషన్లను కూడా సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ స్పందనఈ అంశంపై అమెజాన్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదని, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ అవసరమైన పత్రాలను సమర్పించడానికి మరికొంత సమయం కోరిందని ఆహార భద్రతా శాఖ తెలిపింది. మరోవైపు బిగ్‌బాస్కెట్ ఈ ఉత్పత్తి విక్రయాలను నిలిపివేసినట్లు అథారిటీకి తెలియజేసింది.
Also Read:కర్ణాటకలో H1N1 విజృంభణ
అంతేకాకుండా భవిష్యత్తులో ఇచ్చే లిస్టింగ్స్‌పై “మానవ వినియోగానికి కాదు” అనే లేబుల్‌ను ఉంచుతామని స్పష్టం చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లు మరియు సంబంధిత వర్గాల నుండి నిబంధనల అమలు నివేదికలను (compliance reports) శాఖ కోరింది. ఆదేశాలను ఉల్లంఘించినట్లు తేలితే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

