విశ్వాసపరీక్షలో నెగ్గిన యెడియూరప్ప..స్పీకర్ రాజీనామా

329
yeddi

కర్ణాటకలో అంతా ఉహించిందే జరిగింది. 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో విశ్వాసపరీక్షలో నెగ్గారు యెడియూరప్ప. బలపరీక్షలో బీజేపీకి మద్దతుగా 106 ఓట్లు వచ్చాయి. మేజిక్ ఫిగర్ కంటే రెండు ఓట్లు ఎక్కువగా రావడంతో ఆయన గెలిచినట్లు ప్రకటించారు స్పీకర్ రమేష్ కుమార్‌.

17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో సభలోని సంఖ్య 207 కు చేరింది. బల పరీక్షలో నెగ్గేందుకు కావాల్సిన సభ్యుల సంఖ్య 104. సొంత పార్టీ బలం 105తో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతివ్వడంతో బీజేపీ విజయం లాంఛనమైంది.

కర్ణాటక స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేశారు. రమేశ్‌ కుమార్‌ తన రాజీనామా లేఖను సభలో చదివి వినిపించారు. ఆ రాష్ట్ర విధాన సభలో బలపరీక్ష జరిగిన కాసేపటికే రమేశ్‌ కుమార్‌ స్పీకర్‌ పదవికి రాజీనామా చేశారు.

మరోవైపు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు సుప్రీం బాట పట్టారు. 2023 వరకు తమపై అనర్హత వేటు వేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తూ కాంగ్రెస్‌కు చెందిన రమేశ్‌ జార్కిహోళి, మహేశ్‌ కుమటళ్లి, స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్‌ శంకర్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.దీనిపై సుప్రీం ఏవిధమైన తీర్పు వెలువరిస్తుందో వేచిచూడాలి.