దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సైబర్ దాడి జరిగింది. ఈ ఘటనలో 3,897 మంది ఖాతాదారులకు సంబంధించిన వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారం (PII) డార్క్ వెబ్‌లో బయటపడినట్లు తెలిపింది. ఈ సమాచారం ఎలా లీక్ అయింది? ఎంత మేరకు బయటకు వెళ్లింది? దీని వల్ల ఖాతాదారులకు, బ్యాంకుకు ఎలాంటి ముప్పు పొంచి ఉంది? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు అవసరమని బ్యాంకు పేర్కొంది.
బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజీకి సమర్పించిన నివేదికలో బ్యాంకు ఈ విషయాన్ని వెల్లడించింది. అక్టోబర్ 16, 2026న తమ థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) నుంచి సమాచారం అందినట్లు తెలిపింది. డార్క్ వెబ్‌లో బ్యాంకు ఖాతాదారుల సమాచారాన్ని బహిర్గతం చేసి ఉండవచ్చని ఈ సంస్థలు హెచ్చరించినట్లు వివరించింది.
లీక్ అయినట్లు గుర్తించిన సమాచారంలో ఖాతాదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, పేర్లు, లింగం, ఈ-మెయిల్ చిరునామాలు, నివాస చిరునామాలు ఉన్నట్లు బ్యాంకు వెల్లడించింది. వీటితో పాటు బ్యాంకు శాఖ వివరాలు, సీఐఎఫ్ (CIF) గుర్తింపు సంఖ్యలు, లీడ్ ఐడీలు, రుణాలు లేదా ఇతర సేవలకు సంబంధించిన రికార్డుల మెటాడేటా, ఇతర ఫైళ్లు కూడా బయటపడి ఉండవచ్చని తెలిపింది.
ఈ ఘటనపై ఎస్బీఐ వెంటనే సైబర్ ఘటనల ప్రతిస్పందన, నియంత్రణ చర్యలను ప్రారంభించింది. అంతేకాకుండా, సర్ట్-ఇన్ గుర్తింపు పొందిన స్వతంత్ర సైబర్ భద్రతా సంస్థను నియమించింది. డేటా లీక్ స్వరూపం, పరిధి, దాని వల్ల తలెత్తే ప్రమాదాలను అంచనా వేయడానికి సమగ్ర పరిశీలన చేపట్టినట్లు వెల్లడించింది. దర్యాప్తు ఫలితాల ఆధారంగా అవసరమైన సరిదిద్దే చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
Also Read:జైలర్ 2@రూ.541 కోట్లు
ఈ సైబర్ ఘటన వల్ల బ్యాంకు ప్రధాన కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు లేదా వ్యాపార కొనసాగింపుపై గణనీయమైన ప్రభావం పడలేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని పేర్కొంది.

