హైకోర్టులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
ఈ వ్యవహారం 2023 సంవత్సరానికి సంబంధించినది. భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గండ్ర వెంకటరమణ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
అయితే, ఈ కేసులు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నమోదు చేశారంటూ, వాటిని కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రసంగం రాజకీయ విమర్శల పరిధిలోనే ఉందని, అందులో ఎలాంటి నేర ఉద్దేశం లేదని పిటిషన్‌లో ఆయన వాదించారు.
కానీ, ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఈ దశలో కేసులను కొట్టివేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కేసులో వాస్తవాలు, ఆరోపణలు విచారణకు అర్హమైనవని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఈ వ్యవహారం మరింత ముందుకు సాగనుంది. హైకోర్టు నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read:Harishrao:రేవంత్ స్కామ్ క్యాలెండర్ విడుదల

