Bhumana:ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారం

26
- Advertisement -

తిరుమ‌ల ఆస్థాన‌మండ‌పంలో మూడు రోజుల పాటు జ‌రిగిన వేంక‌టేశ్వ‌ర ధార్మిక స‌ద‌స్సు ముగిసింది. ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ భూమన..మాట్లాడుతూ 1933వ సంవత్సరంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య వైభవాన్ని, సనాతనధర్మాన్ని ప్రపంచమంతటా ప్రచారం చేయటానికి తిరుమల తిరుపతి దేవస్థానముల ఆవిర్భావం జరిగింద‌న్నారు. దాససాహిత్య ప్రాజెక్టు, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, నాలాయిర దివ్యప్రబంధ పారాయణ ప్రాజెక్టు, శ్రీనివాస కల్యాణోత్సవ మరియు శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్టు త‌దిత‌ర ప్రాజెక్టుల ద్వారా ధార్మిక కార్య‌క్ర‌మాల‌ను దేశ‌వ్యాప్తంగా తీసుకెళుతున్నామ‌ని చెప్పారు.

ద‌శాబ్దాల క్రిత‌మే శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల ద్వారా గోసంర‌క్ష‌ణ‌కు టీటీడీ శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి వైభ‌వాన్ని ద‌శ‌దిశ‌లా వ్యాపింప‌చేయ‌డానికి శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌ను తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఏర్పాటుచేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా శ్రీ‌వారి వైభ‌వాన్ని చాటుతున్న‌ట్టు వివ‌రించారు.

పురాణేతిహాస ప్రాజెక్టు ద్వారా అనేక పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాల‌ ముద్ర‌ణ‌, శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు భ‌క్తి సంకీర్త‌న‌ల‌కు ప్రాచుర్యం క‌ల్పిస్తున్న‌ట్టు ఛైర్మ‌న్ తెలిపారు. గ‌తంలో తాను ఛైర్మ‌న్‌గా ఉన్న‌పుడు 2007, 2008లో రెండు సార్లు ధార్మిక స‌ద‌స్సులు నిర్వ‌హించామ‌న్నారు. ఆ స‌ద‌స్సుల్లో స్వామీజీలు చేసిన సూచ‌న‌ల ఆధారంగానే ద‌ళిత‌గోవిందం, మ‌త్స్య గోవిందం, అర్చకుల‌కు శిక్ష‌ణ‌, క‌ల్యాణ‌మ‌స్తు వంటి అనేకానేక ధార్మిక కార్య‌క‌లాపాల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని తెలియ‌జేశారు. శ్రీ‌వారి అనుగ్ర‌హంతో దాదాపు 17 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ ధ‌ర్మ‌ప్ర‌చారాన్ని ముందుకు తీసుకెళ్లే అవ‌కాశం త‌నకు ద‌క్కింద‌న్నారు. హిందూ ధ‌ర్మాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌చారం చేసేందుకు మూడు రోజులుగా జ‌రుగుతున్న ధార్మిక స‌ద‌స్సులో ఎంద‌రో మ‌హానుభావులైన పీఠాధిప‌తులు, మ‌ఠాధిప‌తులు త‌మ అమూల్య‌మైన సూచ‌న‌ల‌ను అందించార‌ని చెప్పారు.

Also Read:పెళ్లిపుస్తకం తర్వాత లగ్గం : రాజేంద్రప్రసాద్

- Advertisement -